కొండ పోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన

కొండ పోచమ్మ రిజర్వాయర్  వద్ద  బీఆర్ఎస్  కార్యకర్తల ఆందోళన
  •     మరోవైపు భూములు తీసుకొని పట్టించుకోలేదని  ప్రాజెక్టు బాధితుల నిరసన

గజ్వేల్/ములుగు, వెలుగు:  మల్లన్నసాగర్, కొండ పోచమ్మసాగర్, రంగనాయకసాగర్  రిజర్వాయర్లలో గోదావరి జలాలను నింపి రైతులకు సాగునీటిని అందించాలని బీఆర్ఎస్​ నేతలు ఆందోళనకు దిగారు. మరోవైపు కొండపోచమ్మసాగర్  ప్రాజెక్టు ముంపు బాధితులు తమకు రావాల్సిన పరిహారం, పునరావాస ప్యాకేజీ వెంటనే అందజేయాలని డిమాండ్  చేస్తూ రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం కొండ పోచమ్మసాగర్  వద్ద రైతులు, బీఆర్ఎస్​ నేతలు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్  నియోజకవర్గ ఇన్​చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం పరిధిలోని కన్నేపల్లి బాహుబలి పంపులను ఆన్​ చేసి గోదావరి జలాలను మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్  రిజర్వాయర్లకు తరలించాలని డిమాండ్​ చేశారు. 

అక్కడి నుంచి హల్దీవాగు, కుడవెల్లివాగు, సంగారెడ్డి, రామారెడ్డి, కామారెడ్డి, బస్వాపూర్  కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేసి వరి నాట్లు వేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఎల్లంపల్లి మీదుగా రిజర్వాయర్లకు నీటిని తరలించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తాగునీటి సమస్య కూడా రోజురోజుకూ తీవ్రమవుతోందన్నారు. కన్నేపల్లి పంపులను ప్రారంభించకుంటే కాంగ్రెస్  నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరించారు.

నిర్వాసితుల రాస్తారోకో..

కొండపోచమ్మసాగర్  ప్రాజెక్టు ముంపు బాధితులు తమకు రావాల్సిన పరిహారం, పునరావాస ప్యాకేజీ వెంటనే అందజేయాలని డిమాండ్  చేస్తూ సిద్దిపేట జిల్లా ములుగులో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్  నిలిచిపోయింది. మామిడ్యాల గ్రామానికి చెందిన ముంపు బాధితులు మాట్లాడుతూ ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ తమకు పరిహారం, ప్యాకేజీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చనిపోయాకే కుటుంబాలకు పరిహారం అందేటట్లు ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. గత ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించలేదని, ప్రస్తుత ప్రభుత్వం తమకు పరిహారం, పునరావాస ప్యాకేజీ అందించాలని కోరారు. ప్రస్తుతం ములుగులోని డబుల్  బెడ్‌రూం ఇండ్లలో ఉంటున్నామని, ఇళ్లు ఖాళీ చేయాలని వారు ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.