- పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
వరంగల్, వెలుగు: కాకతీయ యూనివర్సిటీని రాజకీయాలకు వేదికగా మార్చి నాశనం చేయాలని చూస్తే సహించబోనని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కేయూలో సమస్యలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేయూను రాజకీయ వేదికగా మార్చొద్దని, విద్యార్థులను రెచ్చగొట్టవద్దన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘాల రాజకీయ అజెండా కారణంగానే యంగ్ ఇండియా స్కూల్‌ను తరలించాల్సి వచ్చిందని ఆరోపించారు. విద్యుత్ సబ్‌స్టేషన్, పోలీస్ స్టేషన్, బ్యాంకు కోసం భూములు ఇచ్చినప్పుడు అభ్యంతరం చెప్పని వారు, విద్యా సంస్థ ఏర్పాటును అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. కేయూ వీసీ నిర్లక్ష్యంతో నిధుల వినియోగం, అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయని విమర్శించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటును కొందరు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫారెస్ట్, జీడబ్ల్యూఎంసీ భూముల పేరుతో కొత్త వివాదాలు సృష్టిస్తూ కేయూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. మామునూరు విమానాశ్రయంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా అవసరమైన కేంద్ర అనుమతులు, టెక్నికల్ క్లియరెన్స్‌లు సాధించలేదని, రూ.350 కోట్లకు పైగా జీఎంఆర్‌కు చెల్లించినా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేకపోయారని నాయిని విమర్శించారు.
