అగ్రికల్చర్ వర్సిటీపై బురద జల్లొద్దు..వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఫైర్

అగ్రికల్చర్ వర్సిటీపై బురద జల్లొద్దు..వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఫైర్

హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్ వర్సిటీపై కొందరు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ టీచింగ్ స్టాఫ్ 7వ పే రివిజన్ కమిషన్ బకాయిలకు సంబంధించి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. "గత ప్రభుత్వం రాష్ట్ర వాటా చెల్లించకుండా నిర్లక్ష్యం చేయడంతో దాదాపు 42 నెలల బకాయిలు నిలిచిపోయాయి. ఈ బకాయిల కోసం తాను ఐకార్ కు లేఖ రాయగా, చెల్లింపు సాధ్యం కాదని 2024 మార్చిలో జవాబు వచ్చింది. 

నిజానికి తెలంగాణలోని ఏ వర్సిటీకి కూడా ఏడో వేతన సవరణ బకాయిలు అందలేదు. అయితే, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ సహకారంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌ను కలిసి దాదాపు రూ. 30 కోట్ల బకాయిలు విడుదల చేయించుకున్నాం" అని వెల్లడించారు. అర్హులైన అధ్యాపకులందరికీ బకాయిలు విడుదల చేశామని, ఈ అంశంపై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని, కొంతమంది మాజీ అధికారులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఎంపీల సహకారంతో వర్సిటీకి రూ.500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అగ్రికల్చర్ వర్సిటీని సొసైటీగా నమోదు చేయడంతో ఆదాయపన్ను శాఖ రూ.270 కోట్లకు నోటీసులిచ్చిందని, ఎంపీల సహకారంతో చర్చలు జరిపి ఆ సమస్యను కూడా పరిష్కరించామని వివరించారు. 

ఆరోపణలు అవాస్తవం: టాటా  

పీఆర్సీ అరియర్స్ చెల్లింపుల పేరుతో యూనివర్సిటీ అధికారులు అధ్యాపకుల నుంచి 2 శాతం డబ్బులు వసూలు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని అగ్రికల్చరల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టాటా) ఖండించింది. 2016 నుంచి అమలు కావాల్సిన ఏడో పీఆర్సీకి సంబంధించి రూ.70 కోట్ల మేర అరియర్స్ రావాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు వెనక్కి పోయాయని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అయితే, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్లు రవిల చొరవతో కేంద్రం నుంచి రూ.35 కోట్లు సాధించినట్లు వారు స్పష్టం చేశారు.