మర్రిగూడ, వెలుగు: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.55 వేలు తీసుకుని మోసం చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన చాపల శివ(23)కు ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ కంపెనీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగితో పరిచయం ఏర్పడింది.
అదే కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె శివ నుంచి రూ.55 వేలు తీసుకుంది. ఉద్యోగం ఇప్పించకపోగా, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఆమెను నిలదీశాడు. ఫోన్ చేస్తే కేసు పెడతానంటూ సదరు మహిళ బెదిరించడంతో మనస్తాపంతో గురువారం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు నల్గొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి అన్న వినయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
