- నిధులు ఫుల్.. పనులు నిల్..
- నల్గొండలో 109 భవనాలు చేపడితే.. నాలుగే పూర్తి!
- ప్రస్తుత సెంటర్లలో కనీస సదుపాయలు కరువు..
- మంత్రి సీతక్క రివ్యూలో బయటపడ్డ అధికారుల నిర్లక్ష్యం
నల్గొండ, వెలుగు: నల్గొండ, సూర్యాపేట జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అధ్వానంగా మారింది. అధికారుల పనితీరు సరిగా లేక ఈ రెండు జిల్లాల్లోని సెంటర్లు వెనుకంజలో ఉన్నాయనే విమర్శలున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు జిల్లాల్లో అనేక అంశాల్లో పూర్తిగా వెనుకబడినట్లు ఇటీవల మంత్రి సీతక్క నిర్వహించిన సమీక్షా సమావేశంలో బయటపడింది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, నిధుల వినియోగంలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించడం వల్ల లబ్ధిదారులైన గర్భిణులు, చిన్నారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సమీక్షలో స్పష్టమైంది.
రూ.కోట్లలో బడ్జెట్ విడుదల చేస్తున్నప్పటికీ..
అంగన్‌వాడీల్లో పోషకాహార సరఫరా కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల బడ్జెట్ విడుదల చేస్తున్నప్పటికీ, వాటిని ఖర్చు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మొత్తం బడ్జెట్‌లో సూర్యాపేట జిల్లా కేవలం 25 శాతం, నల్గొండ జిల్లా 26 శాతం మాత్రమే ఖర్చు చేశాయి. మిగిలిన నిధులన్నీ ట్రెజరీలోనే మూలుగుతుండగా, నిధులు ఉండి కూడా క్షేత్రస్థాయిలో ఆహార సరఫరా ఎందుకు జరగడం లేదని మంత్రి అధికారులను నిలదీశారు.
నత్తనడకన పనులు
ఉపాధి హామీ నిధులతో నిర్మించాల్సిన అంగన్‌వాడీ నూతన భవనాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నల్గొండ జిల్లాలో 109 భవనాలు మంజూరైతే ఇప్పటివరకు కేవలం నాలుగే పూర్తి కాగా, 88 పనులు మధ్యలోనే నిలిచిపోయాయి, మరో 17 చోట్ల పునాదులు కూడా పడలేదు. సూర్యాపేట జిల్లాలో 176 భవనాలకు గానూ 42 భవనాలు అసలు ప్రారంభమే కాలేదు. దీనివల్ల చిన్నారులు కనీస సౌకర్యాలు లేని అద్దె భవనాల్లో అల్లాడుతున్నారు.
గుడ్లు, పప్పు పంపిణీలోనూ వెనుకబాటు..
చిన్నారులకు అందించే బలవర్ధకమైన గుడ్లు, పప్పు పంపిణీలోనూ ఈ జిల్లాలు వెనుకబడ్డాయి. జూలై 2026 నాటికి నల్గొండ జిల్లాలో గుడ్ల సరఫరా కేవలం 83.35 శాతానికే పరిమితం కాగా, ప్రభుత్వం దీనిని అతి తక్కువ పనితీరు గల జిల్లాగా ప్రకటించింది. పప్పు పంపిణీలో 87 శాతంతో రాష్ట్రంలోనే చివరి 10 జిల్లాల్లో ఒకటిగా నిలిచింది. పర్యవేక్షణ లోపం కారణంగా నల్గొండలో 56.47 శాతం, సూర్యాపేటలో 64.63 శాతం మంది చిన్నారులు మాత్రమే కేంద్రాలకు వస్తుండటంతో, మిగిలిన వారంతా ప్రైవేట్ స్కూళ్ల బాట పడుతున్నారని రివ్వ్యూలో తేలింది.
అధికారులపై మంత్రి సీరియస్
మూడు రోజుల కింద నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. మౌలిక సదుపాయాల పరంగా చూస్తే సూర్యాపేటలోని అంగన్‌వాడీల్లో టాయిలెట్ సౌకర్యం కేవలం 67.8 శాతం కేంద్రాల్లోనే ఉంది. నల్గొండ జిల్లాలో తాగునీటి సౌకర్యం 89.5 శాతానికే పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాలు ఈ వసతుల్లో 100 శాతం సాధిస్తే, ఈ రెండు జిల్లాలు మాత్రం చివరి స్థానాల కోసం పోటీ పడుతున్నాయి. నెల రోజుల్లోగా యాక్షన్ ప్లాన్ రూపొందించి ఈ పరిస్థితిని మార్చకపోతే కఠిన చర్యలు తప్పవని సీతక్క అధికారులను హెచ్చరించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
