- విలువ రూ. లక్ష 20 వేల కోట్ల పైమాటే...
- 1,810 ఎకరాల ప్రభుత్వ భూమికి విముక్తి
- చెరువుల వద్ద 454 ఎకరాలు స్వాధీనం
- పార్కు స్థలాలు 90 ఎకరాలు, రోడ్లు. ఫుట్ పాత్ లు 62 ఎకరాలు
- నాలాలపై తొలగించిన ఆక్రమణలు 25 ఎకరాలు
- 1,378 అక్రమ కట్టడాల కూల్చివేత
- సవాల్ గా మారిన కోర్టు కేసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, రోడ్లు, నాలాలపై ఆక్రమణలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా అనేక సవాళ్ల మధ్య రెండేండ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ కాలంలో భారీ స్థాయిలో ఆక్రమణలను తొలగించిన హైడ్రా 2,471.11 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చింది. ఈ భూముల విలువ దాదాపు రూ.1.20 లక్షల కోట్ల పై మాటే అని అధికారులు అంచనా వేస్తున్నారు.
అత్యధికంగా 1,810 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆక్రమణల నుంచి విముక్తి కల్పించింది. అలాగే, చెరువుల వద్ద ఆక్రమణలు తొలగించి 454.11 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. 90.39 ఎకరాల పార్కు స్థలాలు, 62.11 ఎకరాల రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పబ్లిక్ ఓపెన్ ప్లేస్ లకి సంబంధించి 26.31 ఎకరాలను కాపాడింది. నాలాలపై ఆక్రమణలను తొలగించి 25.37 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఆక్రమణల తొలగింపులో భాగంగా రెండేండ్లలో 1,378 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది.
రెండో ఏడాదిలోనే అత్యధికం
2024 జూన్ 27న ఫిల్మ్‌నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ పరిధిలోని లోటస్ పాండ్ పార్కు స్థలాన్ని కబ్జా చేసి కంపౌండ్ వాల్ కట్టగా అప్పటి ఈవీడీఎం కమిషనర్‌గా ఉన్న రంగనాథ్దాన్ని కూల్చివేయించారు. తర్వాత ఆక్రమణల పని పట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగాన్ని జూలై 19న హైడ్రాగా మారుస్తూ జీవో ఇచ్చింది. అప్పుడు మొదలైన హైడ్రా ప్రస్థానం అనేక విమర్శలు, ప్రశంసలు, వివాదాల మధ్య కొనసాగుతూనే ఉంది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, సెలబ్రెటీలు, బడాబాబులు ఇలా ఎవరు ఆక్రమణల వెనక ఉన్నా వదల్లేదు. మొదటి ఏడాదిలో 581 ఆక్రమణలను తొలగించి 499 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా..రెండో ఏడాదిలో 797 ఆక్రమణలు నేలమట్టం చేసి ఏకంగా 1972 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. మొదటి ఏడాదిలో కాపాడిన భూమి విలువ సుమారు రూ. 30 వేల కోట్ల వరకు ఉండగా,రెండో ఏడాదిలో ఇది దాదాపు లక్ష కోట్లకు చేరింది.
చెరువులకు జీవం
చెరువుల వద్ద ఆక్రమణలు తొలగించడమే కాకుండా ఆయా చెరువుల అభివృద్ధిని కూడా హైడ్రా చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశలో 6 చెరువులను డెవలప్చేయగా, ఇప్పటికే బతుకమ్మకుంట, కూకట్ పల్లి నల్ల చెరువు, బమృక్ ఉద్దౌలా చెరువులు అందుబాటులోకి వచ్చాయి. మరో మూడు చెరువుల పనులు ఫైనల్దశలో ఉన్నాయి.
రెండో విడతలో 14 చెరువుల పనులను కూడా హైడ్రా చేపట్టింది. వీటికి తోడు క్యూర్ పరిధిలో నలుదిక్కుల 4 చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా డెవలప్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఆదేశించింది. ఈ మేరకు రూ.227.98 కోట్ల పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది. ఈ నిధులతో ఫాక్స్ సాగర్, అమీన్‌పూర్ చెరువు, అంబర్ చెరువు, సరూర్‌నగర్ చెరువుల్లో అభివృద్ధి పనులను హైడ్రా చేపట్టనుంది.
బతుకమ్మ కుంటపై హైకోర్టులోనే తేల్చుకోండి : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, వెలుగు: అంబర్ పేట్ లోని బతుకమ్మ కుంట చెరువు వివాదంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బతుకమ్మ కుంట ఫెన్సింగ్ పై హైడ్రా చెబుతోన్న అంశాలను పరిశీలించాలని హైకోర్టుకు సూచించింది. కుంట వివాదంలో హైడ్రా చేపట్టిన చర్యలపై స్టేటస్ కో మెయింటెన్ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది.
ఈ ఆర్డర్ ను పట్టించుకోకుండా హైడ్రా.. చుట్టు పక్కల క్లీన్ చేసి, బ్యూటిఫికేషన్ పేరుతో ప్రహరీ, సుందరీకరణ పనులు చేసిందంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సుదర్శన్ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. సుందరీకరణ చర్యలు తొలగించి, యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ.. హైడ్రా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు ఆదేశాల అమలుపై రిపోర్ట్ దాఖలు చేశారు. ఈ కేసు శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఈ కేసు వ్యవహారంలో హైకోర్టుకే పూర్తి స్థాయి అవగాహన ఉందని అభిప్రాయపడింది. అందువల్ల మిగతా అంశాలపై అక్కడే తేల్చుకోవాలని సూచిస్తూ విచారణ ముగించింది.
సవాల్ గా మారిన కోర్డు కేసులు
హైడ్రా చర్యలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు కోర్టుల్లో పెద్ద సంఖ్యలో దాదాపు 1200 వరకు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో 900 కేసులు డిస్పోజ్ కాగా, మిగతా వాటిపై విచాణ కొనసాగుతోంది. భూవివాదాలు, యాజమాన్య హక్కులు, కూల్చివేతల చట్టబద్ధత వంటి అంశాలపై న్యాయపరమైన పోరాటం కొనసాగుతోంది. ఈ కోర్టు కేసులు హైడ్రా కు సవాల్‌గా మారాయి. కొన్నిసార్లు కోర్టు ఆదేశాలను పాటించడం లేదన్న విమర్శలు కూడా హైడ్రాపై వచ్చాయి.
మూడో ఏడాది చెరువుల డెవలప్ మెంట్‌పైనే ఫోకస్
రెండేండ్లలో ఆక్రమణలు తొలగించడంతో చెరువుల అభివృద్ధి కూడా చేపట్టాం. ఇప్పటికే ఆరు చెరువుల పనులు పూర్తయ్యాయి. మూడో ఏడాది 14 చెరువులను అభివృద్ధి చేస్తం. దీనికి తోడు మరో నాలుగు చెరువులను మినీ ట్యాంక్ బండ్ల మాదిరి డెవలప్ చేస్తం. ఎల్‌నినో పరిస్థితులతో ప్రస్తుతం నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులు భవిష్యత్‌లో రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాలు పడినప్పుడు నీటిని నిల్వ చేస్తే గ్రౌండ్ వాటర్ బాగుటుంది. చెరువుల పునరుద్ధరణతో కూడా గ్రౌండ్ వాటర్ పెరిగే చాన్స్ ఉంది.
–ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ -
