- సింగరేణి భవన్‌లో జెన్‌కో అధికారులతో సమన్వయ సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ అవసరాలకే తొలి ప్రాధాన్యంగా బొగ్గు సరఫరా చేస్తామని సింగరేణి సీఎండీ బుద్దా ప్రకాష్ జ్యోతి తెలిపారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న బొగ్గులో 72 శాతం తెలంగాణలోని పవర్ ప్లాంట్లకే సప్లై చేస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం సింగరేణి భవన్‌లో జెన్‌కో అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు జరుగుతున్న సింగరేణి బొగ్గు సరఫరాపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ ప్లాంట్ అవసరాల కోసం సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 72 శాతాన్ని సరఫరా చేస్తున్నట్లు సింగరేణి మార్కెటింగ్ విభాగం అధికారులు సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సీఎండీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్ర థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తగినంత బొగ్గు నిల్వలు ఉండేలా ఇరు సంస్థల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
వర్షాకాలంలో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా ఆయా ఏరియాల జీఎంలు చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్పత్తి తగ్గకూడదని, నాణ్యతలోనూ రాజీ పడకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు. జెన్‌కో సీఎండీ డాక్టర్ హరీశ్ మాట్లాడుతూ జెన్‌కో థర్మల్ కేంద్రాల వద్ద ప్రస్తుతం ఉన్న బొగ్గు నిల్వల వివరాలను తెలియజేశారు.
బొగ్గు రవాణాలో ఉన్న ఇబ్బందులపై ఉన్నతాధికారులు చొరవ తీసుకొని పరిష్కరించేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో సింగరేణి డైరెక్టర్లు సూర్యనారయణ, కె. వెంకటేశ్వర్లు, ఎం. తిరుమలరావు, పలువురు జీఎంలు తదితరులు పాల్గొన్నారు.
