పాల్వంచ, వెలుగు: ఆస్తి వివాదం నేపథ్యంలో వృద్ధ తల్లిదండ్రులను ఓ కొడుకు ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఇల్లందులపాడు తండాలో శుక్రవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందులపాడు తండాకు చెందిన భూక్య మంగ్యా, లక్ష్మి దంపతులకు ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు పూలియా పాల్వంచ కేటీపీఎస్‌లో డివిజనల్ ఇంజినీర్‌గా, రెండో కొడుకు ఆర్టిజన్‌గా, చిన్న కొడుకు విద్యాశాఖలో ప్రైవేట్ సీఆర్‌పీగా పనిచేస్తున్నారు. గ్రామంలో ఉన్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ మంగ్యా, లక్ష్మి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్తి వివాదం తలెత్తడంతో పెద్ద కొడుకు పూలియా తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటకు పంపించి, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో వృద్ధ దంపతులు రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో కష్టపడి చదివించి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తే.. ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. నెలకు రూ.2 లక్షల వరకు వేతనం పొందుతున్నప్పటికీ తమకు బుక్కెడు తిండి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
