భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాముడి పేరుతో ఓట్లు దండుకొని, రాముడి ఖజానాను దోచుకున్న వాళ్ల గురించి కేంద్రంలోని బీజేపీ సర్కార్ నోరు మెదపడం లేదని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి విమర్శించారు. శుక్రవారం కొత్తగూడెం, టేకులపల్లి, దమ్మపేట, చంద్రుగొండ మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పర్ణశాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. అయోధ్య రామాలయంలో రూ. కోట్లు దోచుకున్న వారిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. ఈ నెల 20 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పోరాడుతామని తెలిపారు. భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి రద్దైన రైళ్లను పునురుద్ధరించే విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
రాజ్యాంగాన్ని కాపాడేందుకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోరాటం చేస్తుంటే, బీజేపీ నేతలు జీర్ణించుకోలేక గాంధీ కుటుంబంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఓటు హక్కుపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టులను నీళ్లతో నింపాలని కేటీఆర్, హరీశ్‌రావు డిమాండ్ చేస్తున్నారని, నీళ్లతో నింపితే ప్రాజెక్టులు కూలిపోతాయని నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు హెచ్చరించిన విషయం గుర్తించాలన్నారు. ప్రాజెక్టులను కూల్చడం బీఆర్ఎస్ నేతలకే చెల్లిందన్నారు. ఇల్లెందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్, డిప్యూటీ మేయర్ సిరిపురం లలిత, లైబ్రరీ చైర్మన్ పి.వీరబాబు, రైల్వే బోర్డు మెంబర్ వై. శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
