జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ వివాదం.. నరేంద్ర చౌదరి సహా పలువురిపై కేసు

జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ వివాదం.. నరేంద్ర చౌదరి సహా పలువురిపై కేసు

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్(జేహెచ్‌ఐసీ) పాలకమండలిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నకిలీ సంతకాలు, రికార్డుల తారుమారు, ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ సంస్థ మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి సురేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం.. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో(2023 నుంచి 2025 వరకు) జరిగినట్లు చెబుతున్న సమావేశ తీర్మానాల్లో తన సంతకాలను ఫోర్జరీ చేశారు. 

ఎలాంటి తీర్మానం లేకుండానే రిటర్నింగ్ అధికారిని నియమించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. తాను స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నట్లు ఒక నకిలీ లేఖను కూడా తయారు చేసి, రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలోనూ తీవ్ర అక్రమాలు జరిగాయని, అర్హులను అడ్డుకుని 15 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారని సురేందర్ రెడ్డి ఆరోపించారు. 

సంస్థ నిధులు రూ.75 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం ఉందన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎన్టీవీ అధినేత, ప్రస్తుత అధ్యక్షుడు నరేంద్ర చౌదరి, హనుమంతరావు, వసంత్ కుమార్, జగ్గారావు, సురేశ్ రెడ్డి, జనార్దన్ రెడ్డిలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.