పద్మారావునగర్, వెలుగు: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో సంచలనం సృష్టించిన హత్య కేసులో నాంపల్లిలోని ఆరో అడిషనల్మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. రెండో నిందితుడు మొహమ్మద్ షాబాజ్ ఖాన్‌ను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదుతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించింది. కేసు విచారణ దశలో ఉండగానే మొదటి నిందితుడు షోయబ్ చనిపోయాడు. 2015 మార్చి 20న బేగంపేటలోని న్యూ ఎంజీ హోటల్ లో టీ ఇవ్వడం ఆలస్యమైందన్న చిన్న కారణంతో నిందితులు గొడవకు దిగారు. హోటల్ నిర్వాహకుడు మొహమ్మద్ జహంగీర్‌ను బయటకు పిలిచి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. బేగంపేట పోలీసులు ఈ కేసులో పక్కా శాస్త్రీయ, మౌఖిక ఆధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ బలంగా సాక్ష్యాలను ప్రవేశపెట్టడంతో నిందితుడికి జీవిత ఖైదు పడింది.
