రక్తం పారిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు కన్నుమూత

రక్తం పారిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు కన్నుమూత
  • నిద్ర రావడంతో కీసర ఔటర్ ​పక్కన ఆపి పడుకున్న అన్నదమ్ములు  
  • గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి 
  • మేడ్చల్, కూకట్​పల్లిల్లో  బైక్​పై వెళ్తున్న నలుగురు దుర్మరణం
  • బాచుపల్లిలో టిప్పర్​ ఢీకొని తల్లి మృతి

కీసర/పాపన్నపేట, వెలుగు: కీసర పీఎస్​పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అన్నదమ్ములైన గౌస్, రషీద్ గొర్రెలు , మేకల బిజినెస్​చేస్తుంటారు. గురువారం రాత్రి పాపన్నపేట నుంచి బొలెరోలో గొర్రెలు తీసుకుని మరొకరితో కలిసి హైదరాబాద్ మండి మార్కెట్ కు బయలుదేరారు. తెల్లవారు జామున 2 గంటలకు నిద్ర రావడంతో ఔటర్ పక్కన వాహనం ఆపి నిద్రపోయారు. సుమారు 3 గంటలకు గుర్తు తెలియని వాహనం బొలెరోను ఢీకొట్టడంతో రషీద్ (42), డ్రైవర్ మరేలి రాములు (48) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయారు. గౌస్ కు రెండు కాళ్లు విరిగిపోయాయి. అతడి పరిస్థితి విషమంగా ఉంది. 

సరదాగా చేపలు పట్టేందుకు వెళ్తూ ..

మేడ్చల్: చేపలు పట్టేందుకు స్నేహితులంతా కలిసి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు స్నేహితులు తనువు చాలించారు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. దిల్​సుఖ్​నగర్​చింతల్ కు చెందిన సొహైల్ (18), కుత్బుల్లాపూర్​వాసి సుమిత్ గైక్వాడ్ (17), చింతల్ కు చెందిన పవన్, మరో వ్యక్తి స్నేహితులు. నలుగురు కలిసి రెండు బైక్​లపై మేడ్చల్ పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు వెళ్తున్నారు. జాతీయ రహదారి 44 ఎగ్జిట్ 6 వద్ద గుర్తు తెలియని వాహనం ఓ టూవీలర్​ను ఢీకొట్టడంతో సొహైల్, సుమిత్ గైక్వాడ్ చనిపోయారు. వెనక వీరిద్దరూ రాకపోవడంతో తిరిగి వచ్చి చూడగా మరణించి ఉన్నారు. 

మెట్రో పిల్లర్​ని ఢీకొని..

కూకట్​పల్లి : కూకట్​పల్లి పరిధిలో బైక్​ మెట్రో పిల్లర్​ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. జగిత్యాల జిల్లాకు చెందిన అఖిలేష్​యాదవ్(24) కేపీహెచ్​బీకాలనీలోని హాస్టల్​లో ఉంటూ ఎలక్ర్టీషియన్​గా పని చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి బైక్​పై తన ఫ్రెండ్​ యూనస్​(26)తో కలిసి జేఎన్​టీయూ నుంచి కూకట్​పల్లి వైపు వెళ్తున్నాడు. అఖిలేష్​ డ్రైవింగ్​చేస్తుండగా, భాగ్యనగర్​బస్టాప్​ సమీపంలో బైక్​అదుపు తప్పి మెట్రో పిల్లర్​నంబర్​746ని ఢీకొట్టింది. అఖిలేష్​ అక్కడికక్కడే చనిపోగా, యూనస్​దవాఖానకు తీసుకువెళ్తుండగా కన్నుమూశాడు. 

జీహెచ్ఎంసీ టిప్పర్​ ఢీకొని తల్లి మృతి

జీడిమెట్ల: బాచుపల్లి పోలీస్​ స్టేషన్​పరిధిలో జీహెచ్​ఎంసీఆండ్​డీ వేస్టేజ్​టిప్పర్​ ఢీకొని ఓ మహిళ చనిపోగా, ఆమె కూతురు గాయపడింది. ఏపీ తాడేపల్లి గూడానికి చెందిన జాన వెంకటలక్ష్మి(48), లక్ష్మీనారాయణ దంపతులు నిజాంపేట్​బండారీ లేఅవుట్​లో ఉంటున్నారు. వీరికి కొడుకు,కూతురు ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వెంకటలక్ష్మి తన కూతురు దేవి ప్రియతో కలిసి స్కూటీపై నిజాంపేట్​లోని చెత్త డంపింగ్​యార్డు మీదుగా సాయినగర్​ కమాన్​వైపు వెళ్తోంది. తెలుగుయూనివర్సీటీ మహిళా హాస్టల్​వద్దకు రాగానే వేగంగా వచ్చిన జీహెచ్ఎంసీ టిప్పర్​ ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు కిందపడిపోగా టిప్పర్​ముందు చక్రం వెంకటలక్ష్మి పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దేవిప్రియ గాయపడింది.