హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్లు భారీగా సంపాదిస్తున్నట్టు వెల్లడయింది. సాధారణ ఉద్యోగుల కంటే ఫుల్ టైమ్ గిగ్ కార్మికులు 2.5 రెట్లు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. వీళ్ల సంఖ్య 2030 నాటికి 2.1 కోట్లకు చేరనుంది. రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం ఈ రంగంలో 60 లక్షల మంది పని చేస్తున్నారు. ఉపాధి కల్పనలో గిగ్ ఎకానమీ కీలక పాత్ర పోషిస్తోంది.
సర్వేలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది గిగ్ ప్లాట్‌ఫారమ్‌లలో చేరకముందు ఎలాంటి వేతన ఉపాధీ పొందలేదు. 2030 నాటికి వచ్చే కార్మికులలో 30 శాతం మంది మొదటిసారి పనిలోకి వచ్చే వాళ్లే ఉంటారు. దాదాపు 70 శాతం మంది భవిష్యత్‌లో ఆదాయం పెరుగుతుందని నమ్ముతున్నారు. 90 శాతం మంది పార్ట్ టైమ్ పనిని ఎంచుకుంటున్నారు. సంక్షేమ పథకాల వల్ల వీరికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి.
