బజార్‌హత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు ‘భూభారతి’ పేరిట రీ-సర్వేతో పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం బజార్‌హత్నూర్ మండలం గంగాపూర్, డెడ్రా, మాన్కపూర్ గ్రామాల్లో పర్యటించారు. గంగాపూర్‌లో భూభారతి సర్వేపై నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1934 తర్వాత మళ్లీ ఇప్పుడు టెక్నాలజీతో సర్వే జరుగుతోందన్నారు. జిల్లాలోని 509 గ్రామాలకు గానూ, తొలి విడతలో 70 గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. భూములను సర్వే చేసి డిజిటలైజ్ చేస్తామని, ప్రతి భూయజమానికి ఆధార్ తరహాలో భూదార్ కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల భూముల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత ఉంటుందన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉన్నందున రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని సూచించారు. అనంతరం డెడ్రా, మాన్కపూర్ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాన్కపూర్ గిరిజన ప్రైమరీ స్కూల్‌కు భూ సర్వే ఏడీ ప్రభాకర్ స్మార్ట్ టీవీ బహూకరించగా, కలెక్టర్ ఆయనను అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామ్ సుందర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్, సర్పంచులు సుభాష్, విజయ, అనిల్, ఏఈవో ప్రవీణ్, పాల్గొన్నారు.
