ఆన్‌‌లైన్ లోన్ల పేరుతో మోసాలు.. ఒకరు అరెస్ట్.. పరారీలో నలుగురు

ఆన్‌‌లైన్ లోన్ల పేరుతో మోసాలు.. ఒకరు అరెస్ట్.. పరారీలో నలుగురు

ఆదిలాబాద్, వెలుగు: ఆన్‌‌లైన్ రుణాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేసినట్లు ఆదిలాబాద్​ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్‌‌ ముషీరాబాద్‌‌కు చెందిన సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగి తిల్కర్ ఆకాశ్‌‌ను అరెస్టు చేయగా, పోతాని వెంకటసాయి, గోవర్ధన్, అఖిల్, కమలాపురం కార్తీక్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 19న ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామానికి చెందిన మెస్రం ప్రవీణ్ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో తక్కువ వడ్డీకి రుణాల ప్రకటనను క్లిక్ చేశాడు. 

అనంతరం వాట్సాప్ ద్వారా సంప్రదించిన నిందితులు ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులుగా పరిచయం చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు, లోన్ అప్రూవల్, ఈఎంఐ, సర్వీస్ ఛార్జీల పేరుతో విడతల వారీగా రూ.17,951 వసూలు చేసి రుణం మంజూరు చేయకుండా మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ప్రధాన నిందితుడు గతంలో హైదరాబాద్‌‌లోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఆన్‌‌లైన్ రుణాల పేరిట మోసాలు చేసే విధానాన్ని నేర్చుకున్నట్లు ఒప్పుకున్నాడు.

 అనంతరం ఉద్యోగం వదిలి తన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ సహచరులతో కలిసి సోషల్ మీడియా, ఇన్‌‌స్టాగ్రామ్ వేదికగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ ముఠాపై ఇప్పటికే 11 సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.