- రవీంద్రభారతిలో అందజేసిన మంత్రి కొండా సురేఖ
- 70 ఏండ్ల చరిత్రలోనే ఇది తొలిసారి
- త్వరలోనే ఉత్తమ సిబ్బందికి అవార్డుల ప్రదానం.. ఆలయాల్లో వరుణ యాగాలు
- దేవాలయ సేవ ఉద్యోగం కాదు.. భగవంతుడిని కొలిచే పవిత్ర బాధ్యత: సురేఖ
హైదరాబాద్, వెలుగు: ప్రజా ప్రభుత్వం 70 ఏండ్ల సుదీర్ఘ చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకం చేపట్టింది. అర్చకులు, పరిచారకులు, వేదపండితులు, అసిస్టెంట్ కుక్‌లు, డోలు, సన్నాయి, మృదంగం, శృతి, తాళం తదితర విభాగాలకు చెందిన మొత్తం 191 ఉద్యోగాలను భర్తీ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ పారదర్శకమైన పాలనకు, నిబద్ధతకు ఈ నియామకాలే నిదర్శనమని పేర్కొన్నారు. దేవాలయం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వైదిక విజ్ఞానానికి, ధర్మ పరిరక్షణకు కేంద్రంగా నిలిచే పవిత్ర క్షేత్రమని వ్యాఖ్యానించారు. ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ భగవంతుడి సన్నిధిలో సేవ చేసే భాగ్యం దక్కదన్నారు. దేవాలయ ఉద్యోగాన్ని జీవనోపాధిగానో, సాధారణ ఉద్యోగంగానో భావించకుండా.. దేవుడి సేవ చేసే అరుదైన అవకాశంగా, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే గొప్ప బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. అర్చకులు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్ ద్వారా అందే ప్రయోజనాలను పెంచి అందిస్తున్నామని పేర్కొన్నారు.
త్వరలోనే అవార్డులు.. వరుణ యాగాలు
దేవాలయాల్లో సేవలను మరింత మెరుగుపరిచేందుకు పర్యాటక, దేవాదాయ శాఖలు సరికొత్త కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. పనితీరు ఆధారంగా దేవాలయాల అన్ని విభాగాల ఉద్యోగులకు త్వరలోనే అవార్డులు ప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, పురాణ ప్రవచనాల నిర్వహణకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో వరుణ యాగాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ యాగాల ద్వారా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖను బలోపేతం చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రేడ్-–1, గ్రేడ్-–2 ఈవోల ప్రమోషన్లను ఇప్పటికే పూర్తి చేశామని, త్వరలోనే గ్రేడ్-–3 ఈవోల ప్రమోషన్లను చేపడతామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇప్పటికే సరస్వతీ నది పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించామని, రాబోయే రోజుల్లో గోదావరి, కృష్ణా నదీ పుష్కరాలను అదేస్థాయిలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవింద హరి, స్టేట్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ విజయ రాఘవాచార్యులు పాల్గొన్నారు.
