ఇంజినీరింగ్ కొత్త సీట్ల కోసం కాలేజీల్లో తనిఖీలు

ఇంజినీరింగ్ కొత్త సీట్ల కోసం కాలేజీల్లో తనిఖీలు
  • ఒక్క రోజులోనే పూర్తి చేసిన 
  • జేఎన్టీయూ, ఓయూ టీమ్‌లు 
  • ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ, మౌలిక వసతులపై ఆరా 
  • నేడు కొత్త సీట్ల వెల్లడి.. ఆ వెంటనే వెబ్ ఆప్షన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త సీట్ల కేటాయింపు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. అదనపు సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో తగిన వసతులు ఉన్నాయా? లేదా? అన్నది తేల్చేందుకు జేఎన్టీయూ, ఓయూ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కౌన్సెలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో ఒక్కరోజులోనే తనిఖీ ప్రక్రియను పూర్తి చేసేలా యూనివర్సిటీలు పక్కాగా ప్లాన్ చేశాయి. అంతా సవ్యంగా జరిగితే నేడు కొత్త సీట్ల వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నేటి నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. 

ల్యాబ్​లు, ఫ్యాకల్టీపై ఆరా..

జేఎన్టీయూ, ఓయూ పరిధిలోని పలు కాలేజీల్లో తనిఖీలు చేసిన అధికారులు మౌలిక వసతులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీట్ల పెంపునకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఉన్నారా.. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ల్యాబ్ సౌకర్యాలు, క్లాస్ రూమ్స్ అందుబాటులో ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సౌకర్యాలు ఉంటేనే అనుమతులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే, జేఎన్టీయూ పరిధిలోని పలు కాలేజీల్లో మాత్రం గతంలోనే తనిఖీలు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. 

నేడు సీట్ల ప్రకటన 

తనిఖీ బృందాలు సమర్పించే నివేదికల ఆధారంగా విద్యాశాఖ శనివారం అధికారికంగా కొత్త సీట్ల వివరాలను వెల్లడించనుంది. ఈ సీట్లను కౌన్సెలింగ్‌‌‌‌లో చేర్చిన తర్వాత, విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు వీలు కల్పిస్తారు. సీఎస్ ఈ, ఏఐఎంఎల్ తదితర కోర్సుల్లో సీట్లు పెరిగే అవకాశం ఉండటంతో విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మూడు నుంచి నాలుగు వేల సీట్లు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల మేనేజ్‌‌‌‌మెంట్లు మాత్రం మరిన్ని సీట్లు పెంచేలా సర్కారు పెద్దలు, ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతున్నాయి.