హైదరాబాద్, వెలుగు: తెలంగాణ చరిత్రను పునర్నిర్మించాలని, ఇందుకోసం కార్పొరేట్ సీఎస్ఆర్ నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి కోరారు. దక్కన్ ప్రాంతంలో అజేయ యోధుడిగా పేరుగాంచిన తుర్రేబాజ్ ఖాన్ సాహసాన్ని మరువలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో ‘బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి’ (స్టోమింగ్ద బ్రిటీష్రెసిడెన్సీ)అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ సురేందర్ రెడ్డిని సత్కరించారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ.. 1857 జూలై 17న తుర్రేబాజ్ ఖాన్ కొంతమంది వ్యక్తులతో బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి చేశారని గుర్తు చేశారు. ఇది దక్కన్ ప్రాంతంలో జరిగిన ప్రసిద్ధ సిపాయిల తిరుగుబాటుకు కేంద్రంగా నిలిచిందని వివరించారు. తెలంగాణ నుండి అండమాన్‌లోని ‘కాలాపాని’ జైలుకు పంపబడ్డ తొలి యోధుడు మౌల్వి అల్లావుద్దీన్ అని తెలిపారు.
నల్గొండకు చెందిన ఈయనతో కలిసే తుర్రేబాజ్ ఖాన్ బ్రిటీష్ రెసిడెన్సీపై దాడికి దిగారని వివరించారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు టి.వివేక్, చరిత్ర ప్రొఫెసర్ కె. పద్మ రచించిన ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం–సంక్షోభ సంవత్సరాలు’ అనే పుస్తకాన్ని చిన్నారెడ్డి ఆవిష్కరించారు. స్వాతంత్ర్య స్ఫూర్తిని, న్యాయం కోసం సాగిన అన్వేషణను తిరిగి రగిలించడానికి ఈ పుస్తకం సరైన సమయంలో వచ్చిందని ప్రశంసించారు. ఈ సదస్సులో తెలంగాణ స్టడీస్ డైరెక్టర్ పాండురంగారెడ్డి, మహిళా వర్సిటీ వైస్ చాన్స్ లర్ సూర్య ధనుంజయ, చరిత్ర ప్రొఫెసర్లు అరుణ, సత్యనారాయణ పాల్గొన్నారు.
