ఈ నెల నుంచి పది జిల్లాల్లో జనచైతన్య యాత్ర..కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో నిర్ణయం

ఈ నెల నుంచి పది జిల్లాల్లో  జనచైతన్య యాత్ర..కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో నిర్ణయం
  •     ఎస్సీల సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని వెల్లడి
  •     ఎస్సీ వర్గీకరణ, కులగణన చేపట్టిన సీఎం రేవంత్‌‌‌‌కి కృతజ్ఞతలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ నెల నుంచే పది జిల్లాల్లో ‘జనచైతన్య యాత్ర’లు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు హైదరాబాద్‌‌‌‌లోని దిల్‌‌‌‌కుషా గెస్ట్ హౌస్‌‌‌‌లో శుక్రవారం సమావేశమయ్యారు. నాగర్‌‌‌‌కర్నూల్ ఎంపీ, రాష్ట్ర ఎంపీల ఫోరం అధ్యక్షుడు మల్లు రవి అధ్యక్షతన జరిగిన భేటీకి 11 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు హాజరయ్యారు. ప్రభుత్వంపై బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఎస్సీ వర్గీకరణ తర్వాత జరిగిన ఈ మొదటి సమావేశంలో పలు ప్రధానాంశాలపై చర్చించారు. 

ఎస్సీ వర్గీకరణ (ఏబీసీడీ) దిశగా చారిత్రాత్మక అడుగులు వేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డికి సమావేశం ఏకగ్రీవంగా కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం ఆమోదించింది. ఎస్సీ సామాజికవర్గ అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలని, ప్రతి సమావేశానికి ఒక దళిత మంత్రిని ప్రధాన అతిథిగా ఆహ్వానించాలని తీర్మానించారు. సమావేశంలో నియోజకవర్గాల అభివృద్ధి పనులు, దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుపై ప్రజాప్రతినిధులు చర్చించారు. 

మాల, మాదిగ యునైటెడ్ ఫ్రంట్‌‌‌‌గా కలిసి పనిచేస్తాం: ఎంపీ మల్లు రవి

తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, మాల, మాదిగ యునైటెడ్ ఫ్రంట్‌‌‌‌గా కలిసికట్టుగా పనిచేస్తామని ఎంపీ మల్లు రవి ప్రకటించారు. పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ స్కూల్స్‌‌‌‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి కౌంటర్ కార్యాచరణ రూపొందించామన్నారు. రాష్ట్రంలోని హాస్టళ్లలో చదువుకుంటున్న 27 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు మెస్ చార్జీలను 40 శాతం, కాస్మొటిక్ చార్జీలను 200 శాతం పెంచినందుకు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

నియోజకవర్గాల్లో పెండింగ్‌‌‌‌లో ఉన్న ఎస్సీ సమస్యలు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహా పలువురు ఎమ్మెల్యేలు చర్చించారు. త్వరలోనే ఎస్సీ ఎమ్మెల్యేలంతా కలిసి సీఎంని కలిసి తమ నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందజేయాలని నిర్ణయించారు. కాగా, ప్రభుత్వ విప్‌‌‌‌గా ఎన్నికైన వేముల వీరేశం, ఎస్సీ స్కూల్స్ సొసైటీ చైర్మన్ (ఎస్సీ ఎమ్మెల్యే వెల్ఫేర్ కమిటీ చైర్మన్)గా ఎన్నికైన మేడిపల్లి సత్యంను ఎస్సీ ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఈ సమావేశంలో ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, కేఆర్ నాగరాజు, చిక్కుడు వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ, శ్రీగణేశ్‌‌‌‌, కాలే యాదయ్య, లక్ష్మీ కాంతారావుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు.