- వికారాబాద్ లో కౌలు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం
వికారాబాద్, వెలుగు: కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని, ప్రస్తుతం వ్యవసాయ శాఖలో అమలవుతున్న అన్ని సంక్షేమ స్కీంలు కౌలు రైతులకు వర్తింపజేయాలని కౌలు రైతుల గుర్తింపు సాధన సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కౌలు రైతుల గుర్తింపు సాధన సంఘం కమిటీ కౌలు రైతులు, ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం శుక్రవారం వికారాబాద్ లోని క్లబ్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు వీసా కిరణ్, కొండల్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రైతులకు అందే సౌకర్యాలు కౌలు రైతులకు అందడం లేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. 2011 చట్టం అమలు చేయాలన్నారు.
22 జిల్లాల్లో సర్వే
కౌలు రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడానికి గత మే నెలలో తెలంగాణ రాష్ట్రంలో 22 జిల్లాలు, 47 మండలాలు, 58 గ్రామాలలో 1,816 మంది కౌలు రైతులను ప్రత్యక్షంగా కలిసి కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే చేయడం జరిగిందని కౌలు రైతుల గుర్తింపు సాధన సంఘం తెలియజేసింది. ఆ సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో 36 శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, రాష్ట్రంలో ఉత్పత్తి జరుగుతున్న ముడి సరుకుల్లో 50 శాతం వీరి నుంచే ఉత్పత్తి అవుతోందన్నారు.
సమయానికి ఎరువులు దొరక్క, పంట లోన్లు లేక నష్టపోతే నష్టపరిహారం అందక, పంటలు అమ్ముకోవడానికి మార్కెట్లు లేక దిగాలు పడుతున్నారన్నారు. వ్యయ ప్రయాసల కోర్చి వ్యవసాయం చేస్తున్నా వాతావరణం అనుకూలించక పంటలు దిగుబడి తగ్గి చేసిన అప్పులుతీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. సర్వే రిపోర్టును ఉన్నతాధికారులు, ప్రజా సంఘాలు, వ్యవసాయ అనుబంధ రంగాల వారికి సమర్పించామన్నారు. కౌలు రైతుల గుర్తింపు సాధన సంఘం నాయకులు వి.అమరేశ్వర్, ఎస్.యాదయ్య, కె.కరుణానిధి, కౌలు రైతులు సలావుద్దీన్, ఇబ్రహీం మౌలానా, సంగమేశ్వర్, బసప్ప, లాలప్ప తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీని కలిసి వినతిపత్రం అందజేశారు.
