PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జపాన్ ఓపెన్ 2026 టోర్నమెంట్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈరోజు (జూలై 18, శనివారం) జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో చైనాకు చెందిన ఒలింపిక్ ఛాంపియన్, ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫెయ్‌పై సింధు అద్భుత విజయం సాధించింది. సింధు తన కెరీర్‌లో జపాన్ ఓపెన్ సమిట్ క్లాష్ (ఫైనల్) కు చేరుకోవడం ఇదే మొట్టమొదటిసారి.. అంతేకాదు, ఈ విజయంతో చైనా క్రీడాకారిణిపై గత ఐదు మ్యాచ్‌లుగా ఉన్న ఓటముల పరంపరకు (Losing Streak) సింధు ఘనంగా బ్రేక్ వేసింది.
గ్రాండ్ ఫైనల్లో సింధు:
రెండో గేమ్‌లో చెన్ యుఫెయ్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవడంతో సింధు 21–19, 15–10 తేడాతో విజేతగా నిలిచింది. రేపు (జూలై 19, ఆదివారం) జరగబోయే గ్రాండ్ ఫైనల్లో సింధు.. జపాన్ స్టార్ అకానె యామగూచి లేదా ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వర్దానిలతో టైటిల్ పోరులో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్లో లభించిన వాకోవర్ వల్ల సింధుకు తగినంత రెస్ట్ దొరికినట్లయింది, దీంతో ఆమె కోర్టులో పూర్తి శక్తి సామర్థ్యాలతో, పవర్‌ఫుల్ ట్రాన్సిషన్స్‌తో చెన్ యుఫెయ్ డిఫెన్స్‌ను సమర్థవంతంగా ఛేదించింది.
మైండ్ బ్లోయింగ్ కమ్‌బ్యాక్:
ఈ మ్యాచ్‌లో పీవీ సింధు వ్యూహం చాలా స్పష్టంగా కనిపించింది. ఆరంభంలోనే లీడ్ సాధించి, దానిని మ్యాచ్ ముగిసేవరకు కాపాడుకోవాలని ఆమె భావించింది. అయితే మొదటి గేమ్ ప్రారంభంలో చెన్ యుఫెయ్ ఆధిక్యంలోకి వెళ్లడంతో సింధుకు గట్టి పోటీ ఎదురైంది. కానీ ఏమాత్రం పట్టువదలకుండా పోరాడిన సింధు, వరుసగా 4 పాయింట్లు సాధించి 10–5తో బ్రాక్ వైపు దూసుకెళ్లింది. బ్రేక్ సమయంలో కోచ్ ఇచ్చిన అటాకింగ్ సలహాతో సింధు మరింత దూకుడు పెంచింది.
51 షాట్స్ మ్యాచ్‌కే హైలైట్:
ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. ముఖ్యంగా ఇరు స్టార్ల మధ్య జరిగిన 51 షాట్ల సుదీర్ఘ ర్యాలీ (51 Shot Rally) మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది, ఇందులో సింధు పాయింట్ సాధించి పైచేయి సాధించింది. అయినప్పటికీ చెన్ యుఫెయ్ గట్టి పోటీ ఇవ్వడంతో స్కోరు 19–19తో సమమైంది. ఈ ఉత్కంఠ భరిత క్షణంలో సింధు తనలోని సింహాన్ని నిద్రలేపి, పవర్‌ఫుల్ షాట్లతో మొదటి గేమ్‌ను 21–19 తేడాతో సొంతం చేసుకుంది.
గాయంతో తప్పుకున్న చెన్ యుఫెయ్:
మొదటి గేమ్ ఇచ్చిన జోష్‌తో రెండో గేమ్‌లోనూ సింధు అదే వేగాన్ని కొనసాగించింది. ఆరంభం నుంచే పాయింట్ల వేటలో ముందంజలో ఉంటూ 11–7తో బ్రేక్‌కు వెళ్లింది. ఈ దశలో చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయ్ హ్యామ్‌స్ట్రింగ్ నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతూ కనిపించింది. నొప్పి ఎక్కువ కావడంతో ఆమె మ్యాచ్‌ను కొనసాగించలేక మధ్యలోనే తప్పుకుంది.
తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో ఫైనల్:
పీవీ సింధు 2024 సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ తర్వాత బీడబ్ల్యూఎఫ్ (BWF) వరల్డ్ టూర్‌లో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే ప్రపంచ 5వ ర్యాంకర్ హాన్ యుయేను, ఇప్పుడు ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫెయ్‌ను చిత్తు చేసిన సింధు.. ఆదివారం జరగబోయే ఫైనల్లో ఇదే ఫామ్‌ను కొనసాగించి ఈ సీజన్ తొలి టైటిల్‌ను ముద్దాడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
