- రిజర్వాయర్లు, సంపుల నిర్మాణంలో ఆలస్యం
- జూన్ లోనే కంప్లీట్ కావాల్సిన పనులు.. ఇంకా పిల్లర్ల దశలోనే
- అధికారుల అలసత్యం.. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఆలస్యం!
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో అమృత్ 2.0 స్కీమ్ కింద చేపట్టిన రిజర్వాయర్లు(ఓవర్ హెడ్ ట్యాంకులు), సంపుల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2024 నవంబర్‌లో ప్రారంభమైన ఈ పనులు ఈ ఏడాది జూన్ లోపే పూర్తి కావాల్సి ఉండగా.. ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. కొన్ని చోట్లయితే పునాది దశలోనే ఆగిపోయాయి. రాష్ట్రానికి అమృత్ 2.0 కింద మంజూరైన పనులన్నింటిని ఒక్క కాంట్రాక్టరే దక్కించుకోవడంతో తగినంతగా కార్మికులు, మెషినరీ అందుబాటులో లేక నిర్మాణాలు ఆలస్యమవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనులను వేగవంతం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
పడిపోతున్న భూగర్భజలాలు
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా.. భూగర్భ జలాలు మరింతగా పడిపోయే ప్రమాదముంది. దీంతో బోర్లు, బావులు ఎండిపోతే ప్రజలకు తాగునీటితోపాటు ఇతర అవసరాలు తీర్చుకునేందుకు మున్సిపల్ వాటర్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీరు రెండు రోజులకోసారి వస్తుందని, ఓవర్ హెడ్ ట్యాంకుల కొరత కారణంగా నీటి నిల్వ, సరఫరా సామర్థ్యం పెరిగితే రోజూ తాగునీటి సరఫరా చేసే అవకాశముంది.
జిల్లాలో 20 రిజర్వాయర్ల నిర్మాణం..
పదేళ్లలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గణనీయంగా పెరిగింది. కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, దుర్శేడు, గోపాల్ పూర్, కొత్తపల్లి మండలం మల్కాపూర్, చింతకుంట, లక్ష్మీపూర్ గ్రామాలను నిరుడు విలీనం చేసిన విషయం తెలిసిందే. సిటీలోనూ కుటుంబాల సంఖ్య, జనాభా పెరిగింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మెరుగుపరచాల్సి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అమృత్ 2.0 స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్యాకేజీల వారీగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించింది. కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో 13 ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపుల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. 11 చోట్ల మాత్రమే ప్రారంభించారు. వీటితోపాటు బల్దియా పరిధిలో 231 కిలోమీటర్ల పొడవునా పైపులైను వేయాల్సి ఉండగా 155 కి.మీ మేర మాత్రమే పూర్తయ్యింది.
- హుజూరాబాద్ మున్సిపాలిటీలో రూ.16.25 కోట్లతో మూడు సంపులు, ఓవర్ హెడ్ ట్యాంకుల పనులు ప్రారంభించారు. ఈ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. పైపులైన్ల పరిస్థితి అలాగే ఉంది.
- జమ్మికుంట పట్టణంలో రూ.33 కోట్లతో రెండు చోట్ల సంపు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ కూడా 62.56 కి.మీ మేర పైపులైన్ వేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 20 కి.మీ కూడా పూర్తి కాలేదు.
- చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో రూ.36.30 కోట్లతో రెండు సంపులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ఈ పనులు సగం కూడా పూర్తి కాలేదు. అలాగే 65.30 కి.మీ పొడవునా కొత్త పైపులైన్ వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 26 కి.మీ మాత్రమే పూర్తి చేశారు.
