- రాష్ట్రాలకు కేంద్రం సమాచారం
హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర జలాల వినియోగంపై కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఈ నెల 27వ తేదీన తొలిసారి భేటీ కానుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) సీఈ నేతృత్వంలో ఢిల్లీలోని సీడబ్ల్యూసీ ఆఫీసులో మీటింగ్‌ను నిర్వహించనున్నారు. కమిటీకి అప్పగించిన ఆరు అంశాలపై చర్చించనున్నారు. మీటింగ్‌కు సంబంధించి కమిటీలోని సభ్యులకు శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ సమాచారం అందించింది. తుంగభద్ర జలాల్లో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయింపులున్నాయి.
అయితే, కోటా మేరకు నీటిని వాడుకోలేకపోతున్నామని అన్ని రాష్ట్రాలూ చెబుతున్నాయి. ఏపీ, కర్నాటక కొత్త ప్రాజెక్టులకూ పూనుకున్నాయి. ఆయా అంశాలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో మూడు రాష్ట్రాల సీఎంలు గతనెల భేటీ అయి.. సమస్యలను పరిష్కరించే బాధ్యతను కేంద్రానికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం హైపవర్ కమిటీని వేసింది. కర్నాటక జలవనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ, ఏపీ ఈఎన్సీలు, సీడబ్ల్యూసీలోని 4 విభాగాల సీఈలు, తుంగభద్ర బోర్డు కార్యదర్శి, మెంబర్ సెక్రటరీతో మొత్తంగా 9 మంది కమిటీలో ఉన్నారు.
ఆర్డీఎస్ దిగువన నీటి వి నియోగం, డిమాండ్లు, నిర్వహణ సమస్యలు, ప్రస్తుత పరిస్థితి, తుంగభద్ర రిజర్వాయర్లో పూడిక స్థాయి, తగ్గిన నీటి నిల్వ సామర్థ్యం, సాగు, తాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తిపై పడే ప్రభావం, పూడిక తొలగింపు సాంకేతిక, ఆర్థిక అంశాలు, నివారణ మార్గాలు, నావళి రిజర్వాయర్‌తదితర అంశాలను అధ్యయనం చేయాలని కమిటీకి సూచించింది. ఆరునెలల్లో నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది.
