వాషింగ్టన్/బీజింగ్: అమెరికా ఎన్నికల డేటాను చైనా హ్యాక్ చేసిందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవస్థలోని షాకింగ్ లోపాలపై నిఘా సమాచారాన్ని బహిర్గతం చేస్తానని ఆయన చెప్పారు. ఓటింగ్ విధానంలో సమూల మార్పులు చేయకపోతే అమెరికా మధ్యంతర ఎన్నికల్లో కూడా అక్రమాలు జరిగే అవకాశం ఉందని, ఓటు వేయడం చాలా కష్టతరం అయ్యేలా మార్పులు చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు.
శుక్రవారం రాత్రి వైట్ హౌస్ నుంచి టీవీ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘2020 ఎన్నికల సమయం నుంచి చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల డేటా దొంగతనానికి చైనా పాల్పడిందని భావిస్తున్నారు. దీనివల్ల 220 మిలియన్ల అమెరికా ఓటర్ల ఫైళ్లను చైనా అక్రమంగా సేకరించింది’’ అని పేర్కొన్నారు. చైనా చేసిన డేటా మోసాన్ని కప్పిపుచ్చడానికి అమెరికా అంతర్గత వ్యవస్థ (డీప్ స్టేట్)లోని కొందరు సభ్యులు పని చేశారని ఆయన ఆరోపించారు.
‘‘ఈ డేటా నష్టం అమెరికా ఎన్నికల భద్రతకు ఒక పీడకల లాంటిది’’ అని వ్యాఖ్యానించారు. తన ప్రసంగ ముగింపులో ‘సేవ్ యాక్ట్’ చట్టాన్ని ఆమోదించాలని ట్రంప్ కోరారు. ఓటు నమోదు చేసుకునే ఎవరికైనా అమెరికా పౌరసత్వానికి సంబంధించిన పత్రాల ఆధారాలు తప్పనిసరి చేయడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.
దురుద్దేశపూరిత నిందలేనన్న చైనా
ట్రంప్ ఆరోపణలపై చైనా శుక్రవారం తీవ్రంగా విరుచుకుపడింది. ట్రంప్ వ్యాఖ్యలను కల్పితాలుగా, దురుద్దేశపూరిత నిందలుగా కొట్టిపారేసింది. ఇకనైనా ఇలాంటి ఆధారరహిత ఆరోపణలు చేయడం ఆపాలని అమెరికా అధ్యక్షుడిని హెచ్చరించింది. అమెరికా ఎన్నికలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు.
