- అనేక చోట్ల వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం
- జోర్డాన్‌లో అమెరికా యుద్ధవిమానాలను పేల్చేశామని ఇరాన్ ప్రకటన
- ఖతార్, కువైట్, సిరియా, బహ్రెయిన్ దేశాలపైనా క్షిపణుల వర్షం
- కువైట్‌కు కీలకమైన విద్యుత్, నీటి శుద్ధీకరణ ప్లాంట్ ధ్వంసం
టెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదిరింది. ఇరాన్, అమెరికా మధ్య వరుసగా ఆరో రోజున దాడులు, ప్రతిదాడులు తీవ్రమయ్యాయి. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా తన వైమానిక దాడులను శుక్రవారం తెల్లవారుజామున మరింత ఉధృతం చేసింది. ఇందులో భాగంగా మరిన్ని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు ఇరాన్‌కు చెందిన కీలకమైన చాబహర్ పోర్టులోని టవర్‌ను కూల్చివేసింది. హార్మూజ్ జలసంధిపై ఇరాన్ విధిస్తున్న ఆంక్షలను సడలించేలా ఒత్తిడి తెచ్చేందుకు, అక్కడి మౌలిక సదుపాయాలపై దాడులు ప్రారంభిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల్లో భాగంగానే ఈ దాడులు జరిగాయి. మరోవైపు ఈ యుద్ధంలో కీలక మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌తో సహా పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ సరికొత్త క్షిపణి దాడులకు దిగింది. కువైట్‌కు ఎంతో కీలకమైన విద్యుత్, నీటి శుద్దీకరణ ప్లాంట్‌ను కూడా ఇరాన్ దెబ్బతీసింది. అమెరికా దాడుల వల్ల కనీసం 38 మంది మరణించారని, 400 మందికిపైగా గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ తెలిపారు.
కుప్పకూలిన చాబహర్ పోర్టు టవర్
ఇరాన్‌పై శుక్రవారం తెల్లవారుజామున జరిపిన వైమానిక దాడుల్లో డజన్ల కొద్దీ లక్ష్యాలను దెబ్బతీసినట్లు అమెరికా మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా ఇలా వరుసగా రాత్రి దాడులు చేయడం ఇది ఆరో రోజు. ఒమన్ గల్ఫ్‌లోని ఇరాన్ చాబహార్ పోర్టులోని ఒక టవర్‌ను కూడా ఈ దాడుల్లో అమెరికా కూల్చివేసింది. భారత్ సహకారంతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ పోర్టు, అమెరికా వైమానిక దాడులకు నిరంతరం లక్ష్యంగా మారుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా తాము జరిపిన తాజా వైమానిక దాడుల్లో ఎయిర్ డిఫెన్స్, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, నౌకాదళ సామర్థ్యాలతో సహా డజన్ల కొద్దీ సైనిక లక్ష్యాలను దెబ్బతీసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా దాడులతో వంతెనలు, రైల్వే స్టేషన్, విమానాశ్రయంతో కూడిన పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
అమెరికా విమానాలను పేల్చేసిన ఇరాన్
అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగా, జోర్డాన్‌లో ఉన్న పలు అమెరికా సైనిక విమానాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. అమెరికాకు చెందిన పలు రీఫ్యూయలింగ్ విమానాలను, ఫైటర్ జెట్లను ధ్వంసం చేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టం
కలిగించామని ఐఆర్జీసీ పేర్కొంది.
గల్ఫ్ దేశాలపై ఐఆర్జీసీ దాడులు
ఇరాన్ సైనికుల మరణానికి ప్రతీకారంగా సిరియాలోని అల్-తాన్ఫ్ వద్ద ఉన్న అమెరికా ప్రత్యేక ఆపరేషన్ల కమాండ్ సెంటర్‌పై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని సెమీ-అటానమస్ కుర్దిష్ రీజియన్‌లోని ఇర్బిల్, సులేమానియా నగరాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఖతార్, బహ్రెయిన్, కువైట్‌లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో తమ దేశంలోని ఓ విద్యుత్, నీటి శుద్దీకరణ ప్లాంట్‌కు భారీ నష్టం వాటిల్లిందని కువైట్ అధికారులు తెలిపారు. కాగా, ఇరాన్‌తో యుద్ధంలో ఘన విజయం సాధించబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
