మాలలకు 5% రిజర్వేషన్లు అమలు చేయాలి : మాదిగ సంఘాల నేతలు

మాలలకు 5% రిజర్వేషన్లు అమలు చేయాలి : మాదిగ సంఘాల నేతలు
  •     మాల, మాదిగ సంఘాల నేతల డిమాండ్​
  •     ఆగస్టు 11 లోగా పరిష్కరించకుంటే ఉద్యమిస్తాం: మాల మహానాడు హెచ్చరిక

బషీర్‌‌బాగ్,వెలుగు: ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాల, మాల ఉపకులాలకు కేటాయించిన 5 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని మాల, మాదిగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌‌బాగ్‌‌ ప్రెస్ క్లబ్‌‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, మాదిగ దండోరా వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సతీష్​లతో కలిసి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మాట్లాడారు. మాల, మాల ఉపకులాలకు రోస్టర్ పాయింట్ ను 22 కేటాయించడం వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. రోస్టర్ పాయింట్ ను 20 లోపు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే నాగరాజులు మాత్రమే మాట్లాడుతున్నారని.. మిగిలిన మాల ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఆగస్టు 11 వరకు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, మాదిగ దండోరా వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సతీష్ మాదిగలు మాట్లాడుతూ మాలలకు 5 శాతం రిజర్వేషన్ల విషయంలో మాల, మాదిగలు ఐక్యంగా పోరాటం చేస్తామని అన్నారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సాయికృష్ణ, మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎన్.పుష్పరాజు, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద రంజిత్ కుమార్, మాల మహానాడు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సరళ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగి ఆనందరావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బైండ్ల శ్రీనివాస్, జయకుమార్, శ్రీకాంత్, బొట్టు బాలకృష్ణ, రామ్ చందర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.