పదిహేనేండ్ల తర్వాత ఈఎస్ఐలో స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్ : మంత్రి వివేక్ వెంకటస్వామి 

పదిహేనేండ్ల తర్వాత ఈఎస్ఐలో స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్ : మంత్రి వివేక్ వెంకటస్వామి 

రాష్ట్రంలో కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దాదాపు 15 ఏండ్ల తర్వాత రాష్ట్ర ఈఎస్ఐలో భారీ స్థాయిలో స్టాఫ్ నర్సుల నియామకాలు  చేపట్టామని మంత్రి వివేక్ వెంకటస్వామి  తెలిపారు. 2011 తర్వాత ఈఎస్ఐ శాఖలో ఇదే తొలి భారీ ప్రత్యక్ష నియామక ప్రక్రియ అని పేర్కొన్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నర్సింగ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని, అందుకే సిబ్బంది కొరతను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

ప్రస్తుతం ఈఎస్ఐ సేవలు రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది బీమా పొందిన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 75 లక్షల మంది లబ్ధిదారులకు అందుతున్నాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఈఎస్ఐ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్న మంత్రి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో ఈఎస్ఐ హాస్పిటల్స్ పై  సమగ్ర సమీక్ష నిర్వహించామని తెలిపారు.