సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కలిపు మధు, లక్ష్మణ్ కలిసి నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని మూసాపేట శ్రీరాములు థియేటర్‌లో చిత్ర బృందం వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ ‘వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది.
వారాహి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఒక గొప్ప అనుభూతి. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’ అని చెప్పాడు. వారాహి అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు చేరాలని, అలాగే తమ సినిమా గురించి కూడా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి అన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 థియేటర్లలో వారాహి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి, అక్కడ నిరంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్మాతలు తెలియజేశారు. మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, నరేష్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
