హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్- గండిమైసమ్మ మండలం దూలపల్లిలోని ఫాక్స్ సాగర్ లేక్ ఎఫ్‌టీఎల్‌లోని నిర్మాణాలకు సంబంధించి ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదంటూ శుక్రవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. సర్వే నెం.118, 119, 122లో ఉన్న భూమి నివాసయోగ్యత భూమి కాదని పేర్కొంటూ ఈ నెల 7న ఇచ్చిన జీవో 186, 187ను సవాల్ చేస్తూ రోహన్ గుండాల అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫాక్స్‌సాగర్ లేక్ ఎఫ్‌టీఎల్ ప్రాంతమంటూ గతంలో జారీ చేసిన భూవినియోగ మార్పిడి ఉత్తర్వులను రద్దుచేసిందని తెలిపారు. దీంతో హైడ్రా ఎప్పుడైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు.
