బిజినెస్ @ సెల్లార్!..గ్రేటర్ వరంగల్ లో హాస్పిటళ్లు, కమర్షియల్ కాంప్లెక్సుల ఇష్టారాజ్యం 

బిజినెస్ @ సెల్లార్!..గ్రేటర్ వరంగల్ లో హాస్పిటళ్లు, కమర్షియల్ కాంప్లెక్సుల ఇష్టారాజ్యం 
  •     రూల్స్ అతిక్రమించి వ్యాపారాల నిర్వహణ
  •      బండ్లన్నీ రోడ్లను ఆక్రమిస్తుండటంతో పార్కింగ్ సమస్యలు
  •      లైట్ తీసుకుంటున్న గ్రేటర్ ఆఫీసర్లు 

పార్కింగ్ కోసమే వినియోగించాల్సి ఉన్నప్పటికీ.. అందులో ఏకంగా మెడికల్ ఏజెన్సీనే నిర్వహిస్తున్నారు. వాహనాల కోసం ఉపయోగించాల్సిన సెల్లార్ లో బిజినెస్ నడిపిస్తూ బండ్లన్నీ రోడ్డును ఆక్రమించి పార్కింగ్ చేస్తుండటంతో ఈ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్నేండ్లుగా రూల్స్ అతిక్రమించి దందా సాగిస్తున్నా గ్రేటర్ ఆఫీసర్లు మామూళ్లమత్తులో లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రైవేటు హాస్పిటళ్లు, కమర్షియల్ కాంప్లెక్సుల ఇష్టారాజ్యం నడుస్తోంది. బిల్డింగ్ రూల్స్ ప్రకారం సెల్లార్లను కేవలం పార్కింగ్ కోసమే వినియోగించాల్సి ఉన్నా.. పట్టించుకోకుండా దందా సాగిస్తున్నాయి. సెల్లార్లను బిజినెస్ అవసరాలకు ఉపయోగించుకుంటూ ఆయా హాస్పిటళ్లు, కమర్షియల్ కాంప్లెక్సులకు సంబంధించిన వెహికల్స్​ రోడ్లపైనే పార్క్ చేస్తున్నారు. ఫలితంగా వరంగల్ రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతుండగా, యాక్షన్ తీసుకోవాల్సిన జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు మామూళ్లకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

సెల్లార్లలోనే షాపులు, మెడికల్ ఏజెన్సీలు..

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వెయ్యికిపైగా కమర్షియల్ బిల్డింగులున్నాయి. అందులో షాపింగ్ కాంప్లెక్సులు, హాస్పిటల్స్, హోటల్స్, తదితర బిజినెస్ లు నడుస్తున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్-2012 ప్రకారం హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్సులు, ఇతర బడా బిల్డింగులు సెల్లార్లను కేవలం పార్కింగ్ కోసమే వినియోగించాలి. కానీ వరంగల్ ట్రై సిటీలో ఈ రూల్ అమలు కావడం లేదు. బిల్డింగ్ పర్మిషన్ ఒకలా తీసుకుని, కన్ స్ట్రక్షన్ మరోలా చేపట్టి సెల్లార్లను బిజినెస్ అవసరాలకు వినియోగిస్తున్నారు. సెల్లార్లలో రూంలు కట్టి షెట్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. హనుమకొండ పెట్రోల్ పంప్ సమీపంలోని ఓ కాంప్లెక్స్ లో మొబైల్ రిపేరింగ్, జిరాక్స్ సెంటర్, జనరేటర్ రిపేరింగ్ షాప్, ఆఫీస్ రూం నిర్వహిస్తుండగా, మరికొన్ని కాంప్లెక్సులు ఒకట్రెండు రూంలు వేసి సెక్యూరిటీ సిబ్బంది నివాసాలకు కూడా ఉపయోగిస్తున్నాయి. హనుమకొండ కాకాజీకాలనీ, హనుమాన్ టెంపుల్ లేన్, పద్మాక్షి టెంపుల్ మార్గంలో చాలా బిల్డింగుల్లో మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లు నడుపుతుండటం గమనార్హం. వరంగల్ నగరంలో మెయిన్ రోడ్డు వెంట ఉన్న చాలా కాంప్లెక్సులు, బడా బిల్డింగుల్లో 
ఇదే పరిస్థితి.

బండ్లతో రోడ్లన్నీ బ్లాక్..

గ్రేటర్ సిటీలోని వందలాది కాంప్లెక్సులు సెల్లార్లను పార్కింగ్ కు బదులు ఇతర అవసరాలకే వినియోగిస్తున్నాయి. దీంతో ఆయా కాంప్లెక్సులకు వచ్చే బండ్లన్నీ రోడ్ల మీదే పార్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా వరంగల్ నగర వ్యాప్తంగా కిలోమీటర్ల మేర రోడ్లు బ్లాక్ అయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. హనుమకొండలోని కాకాజీ కాలనీ, పద్మాక్ష్మీ టెంపుల్ లేన్ దీనికి ఉదాహరణ. సెల్లార్లను ఆఫీస్ రూంలు, ఇతర షాపులు, బిజినెస్ లకు వినియోగిస్తుండటంతో వరదలు వచ్చినప్పుడు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒక్కసారిగా వరద ముంచెత్తితే ఆయా షాపులు, రూంలలో ఉండే సిబ్బంది తప్పించుకోలేక తీవ్ర నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉంది.

కొత్త కమిషనర్ దృష్టి పెడితేనే.. 

సెల్లార్లను పార్కింగ్ కోసం కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తూ సమస్యలకు కారణం అవుతుండటంతో దాదాపు ఐదేండ్ల కింద గ్రేటర్ ఆఫీసర్లు ట్రై సిటీ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో వివిధ హాస్పిటల్స్, హోటల్స్, కాంప్లెక్సులను తనిఖీ చేసి, రూల్స్ అతిక్రమించి కట్టిన రూంలను తొలగించారు. ఆ తర్వాత అలాంటి తనిఖీలేమీ చేపట్టకపోవడంతో చాలా బిల్డింగులు సెల్లార్లనే బిజినెస్ అడ్డాలుగా మార్చుకున్నాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్-2012 సెక్షన్ 13 ప్రకారం సెల్లార్ నిబంధనలు అతిక్రమిస్తే మున్సిపల్ ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ అలాంటివేమీ లేకపోవడంతో బిల్డింగ్ రూల్స్ బ్రేక్ చేయడం షరా మామూలైంది. దీంతో వరంగల్ లో సెల్లార్, పార్కింగ్ సమస్యలు తీవ్రమయ్యాయి. ఇప్పటికైనా గ్రేటర్ కమిషనర్ వెంకన్న సెల్లార్ నిబంధనలు పాటించని బిల్డింగులపై తగిన చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.