- ఇప్పటికే కేజీబీవీ స్టూడెంట్లకు అందిన దుస్తులు
- ఈసారి బ్రాండెడ్ వస్త్రం.. మఫత్‌లాల్‌తో ఒప్పందం
- 27 లక్షల మంది స్టూడెంట్లకు ప్రయోజనం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పంద్రాగస్టు నాటికి కొత్త యూనిఫామ్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. క్లాత్ సరఫరా నుంచి కుట్టు పని వరకు ప్రతి దశలోనూ నాణ్యతకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గతంలో యూనిఫాంల క్వాలిటీపై అనేక ఫిర్యాదులు వచ్చేవి. ఈసారి దేశంలోనే పేరుగాంచిన మఫత్‌లాల్ వంటి సంస్థల నుంచి ప్రభుత్వం వస్త్రాన్ని సేకరించింది. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున 2.97 కోట్ల మీటర్ల వస్త్రాన్ని రెడీ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లోని 85 వేల మంది విద్యార్థినులకు యూనిఫాంలు చేరాయి. మిగిలిన స్కూళ్లు, గురుకులాలకు జెండా పండుగ నాటికి పంపిణీ పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
కుట్టు పని మహిళా సంఘాలకే..
యూనిఫాంలను కుట్టే పనిని ప్రభుత్వం గతంలో మాదిరే మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది. ఒక్కో యూనిఫాం కుట్టు కూలిగా రూ.75 చెల్లిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రోజుకు 75 వేల నుంచి లక్ష యూనిఫాంలు కుట్టే సామర్థ్యం ఉండటంతో ప్రస్తుతం స్టిచ్చింగ్ పనులు జోరందుకున్నాయి.
రూ. 687 కోట్లతో కిట్లు సిద్ధం..
కేవలం యూనిఫాంలే కాకుండా విద్యార్థులకు సంపూర్ణమైన కిట్‌ను ప్రభుత్వం అందజేస్తోంది. స్కూల్ స్టూడెంట్లకు నల్లటి బూట్లు, సాక్సులు, బెల్టు ఇవ్వనున్నారు. గురుకుల విద్యార్థులకు యూనిఫాం, వైట్ అండ్ బ్లాక్ షూస్, సాక్స్, టై, బెల్ట్, ఐడీ కార్డు, స్కూల్ బ్యాగ్, బెడ్డింగ్ సామగ్రి, ప్లేటు, గ్లాసు, కటోరా, ట్రంక్ బాక్స్ ఇవ్వనున్నారు. మైనారిటీ గురుకులాల్లో మొదటిసారిగా ట్రాక్ సూట్, నైట్ డ్రెస్సులను ప్రభుత్వం ఇస్తోంది. గతంలో ఒక్కో గురుకుల విభాగం విడివిడిగా సామగ్రిని కొనుగోలు చేయడంతో ధరలు, క్వాలిటీలో తేడాలు వచ్చేవి. ఈ గందరగోళానికి చెక్ పెడుతూ ప్రభుత్వం ఈ ఏడాది సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చింది. విద్యార్థుల యూనిఫాంలు, ఇతర సామగ్రి కోసం ప్రభుత్వం రూ. 687.78 కోట్లను వెచ్చిస్తోంది. ఇందుకోసం టీజీఎస్‌సీవో, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వంటి సంస్థలకు బాధ్యతలు అప్పగించింది.
ఇంటర్ విద్యార్థులకూ మొదటిసారి..
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తొలిసారి సుమారు 2 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు కాలేజీ బ్యాగ్, బెల్ట్, టై, షూస్, సాక్సులతో కూడిన కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ప్రైవేట్ కాలేజీ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ కాలేజీ పిల్లలు కూడా హుందాగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ బాధ్యతలను టీజీఎస్‌సీవో, టీజీఎల్ఐపీసీ, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్లకు అప్పగించడం విశేషం.
వచ్చే నెల 13 నాటికి యూనిఫామ్‌ల కుట్టు పూర్తి చేయండి
జిల్లా అధికారులకు స్పెషల్ సీఎస్ దానకిశోర్ ఆదేశం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే కార్యక్రమాన్ని వచ్చే నెల 13 నాటికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. లోక్ భవన్ నుంచి శుక్రవారం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు (డీఆర్‌డీఓలు), మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు, డీపీఎంలు, ఏపీఎంలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్లతోపాటు అవసరమైన సంఖ్యలో బల్క్ కటింగ్ సిబ్బందిని సమీకరించాలని సూచించారు. మండల కేంద్రాలకు వస్త్రం చేరిన వెంటనే పాఠశాలల వారీగా బల్క్ కటింగ్ ప్రారంభించాలన్నారు. కొన్ని జిల్లాల్లో వస్త్రం పాక్షికంగా మాత్రమే అందాయని, మిగిలిన వస్త్రం త్వరగా చేరేలా ఆర్‌సీఓలు, డీసీఓలతో సమన్వయం చేసుకోవాలని డీఆర్‌డీఓలు, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లకు సూచించారు. యూనిఫాంల కుట్టులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
