- ఈ స్కీమ్‌తో తెలంగాణ యువతకు మంచి అవకాశాలు: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ శక్తిగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘సెమికాన్ 2.0’స్కీమ్ కింద రాబోయే పన్నెండ్లలో రూ.1,27,500 కోట్ల వ్యయంతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ స్కీమ్‌తో తెలంగాణకు చెందిన యువతకు మంచి అవకాశాలు దక్కనున్నట్లు తెలిపారు. 2028లో తొలి సిలికాన్ ఫ్యాబ్ ప్రారంభం కానుండగా.. భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ, డిజైన్ హబ్‌గా నిలిపేందుకు సెమికాన్ 2.0 స్కీమ్ కీలక పాత్ర పోషించనుందని శుక్రవారం కేంద్ర మంత్రి కార్యాలయం ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా సప్లయ్ చైన్‌లో ఇబ్బందులు, సాంకేతికంగా దేశాల మధ్య పోటీ పెరుగుతోందని, దీనిని అధిగమించేందుకు ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా భారత్‌ను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే రూ.62,500 కోట్లతో తీసుకొచ్చిన మొబైల్ ఫోన్ మ్యానుఫ్యార్చరింగ్ స్కీమ్ (ఎంపీఎంఎస్) కూడా దేశ మొబైల్ తయారీ రంగంలో ఒక కొత్త విప్లవానికి బాటలు వేయనుందన్నారు. మొబైల్, సెమీకండక్టర్ రంగం అభివృద్ధి కోసం మొత్తంగా రూ.1.9 లక్షల కోట్లను కేటాయించినందుకు ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణకు ఇదే సరైన సమయం...
ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ రంగంలో జరుగుతున్న మార్పులను తెలంగాణకు అవకాశాలుగా మలుచుకునేందుకు ఇదే సరైన సమయమని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, వ్యాక్సిన్, హెల్త్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ రంగాలకు ప్రముఖ కేంద్రంగా ఎదిగిందని గుర్తుచేశారు. సెమికాన్ 2.0తో తెలంగాణకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొబైల్ తయారీకి పెద్ద ఎత్తున ప్రోత్సాహాకాలను అందుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. చిప్ డిజైన్, సెమీకండక్టర్ తయారీ, క్లీన్‌రూమ్ టెక్నాలజీ, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ వంటి యువత ఆధునిక నైపుణ్యాలతో ప్రపంచస్థాయి ఉద్యోగాలు, స్టార్టప్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ‘సెమికాన్ 1.0’స్కీమ్ కింద తెలంగాణకు చెందిన విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కాయని గుర్తుచేశారు. దేశంలోని 68 వేల మంది విద్యార్థులకు ఎలక్ట్రానిక్ డిజైన్ అటొమేషన్ టూల్స్‌తో కూడిన శిక్షణ అందించినట్లు చెప్పారు.
