- దేశంలో ఇదే మొట్టమొదటిది.. ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
- మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలి
- దేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం
- భారత్ మెడికల్ టూరిజం హబ్‌గా ఎదుగుతున్నది
- హైడ్రోజన్ రైళ్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ‘జింద్’ పేరు చరిత్రలో నిలిచిపోతుందని వెల్లడి
- చండీగఢ్‌లో రూ.4,700 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన
జింద్ (హర్యానా): ఆధునిక ఆలోచనలతోనే ‘వికసిత్ భారత్’ కల సాకారం అవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును శుక్రవారం మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం, చండీగఢ్ చేరుకున్నారు. పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజ్ (పీఈసీ) వేదికగా జరిగిన కార్యక్రమంలో రూ. 4,700 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ చరిత్రాత్మక ప్రయోగంతో హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుతున్న ప్రపంచంలోని కొన్ని మేటి దేశాల సరసన భారత్ నిలిచిందన్నారు. ‘‘భారతీయ రైల్వేల గురించి మాట్లాడుకుంటే బొంబాయి (ముంబై) నుంచి ఠాణే ప్రయాణం ఎలా గుర్తుకొస్తుందో.. ఇకపై హైడ్రోజన్ రైళ్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ‘జింద్’ పేరు చరిత్రలో నిలిచిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని తమ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నదని వెల్లడించారు. 2014కు ముందు ఈ పరిస్థితి వచ్చి ఉంటే.. దేశ రైల్వే వ్యవస్థ కుప్పకూలి ఉండేదన్నారు. అప్పట్లో చాలా వరకు రైళ్లు డీజిల్‌తోనే నడిచేవని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ గులాబ్ చంద్ కటారియా, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
కాలంతో బలోపేతమయ్యే సంస్థలను నిర్మించాలి
దేశాన్ని ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)గా మార్చే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భవిష్యత్ సాంకేతికత, ఆధునిక వైద్య సేవలకు తగ్గట్టుగా ఆధునిక ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘‘మనం తీసుకునే నిర్ణయాలు కేవలం ప్రస్తుత తరానికే కాదు.. రాబోయే తరాలకు కూడా ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి. కాలంతోపాటు మరింత బలోపేతం అయ్యే సంస్థలను మనం నిర్మించాలి. ఆ దిశగానే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది’’ అని స్పష్టం చేశారు. చండీగఢ్‌లో దశాబ్దాలుగా స్వచ్ఛందంగా పరిశుభ్రత ఉద్యమాన్ని నడుపుతూ, గత నెలలోనే పద్మశ్రీ అవార్డు అందుకున్న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇందర్‌జీత్ సింగ్ సిద్ధూను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఆయనను ‘బ్రూమ్ వారియర్’ అని పేర్కొన్నారు. 2030లో కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు దేశం సిద్ధమవుతున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని
హామీ ఇచ్చారు.
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
దేశంలో వైద్య సేవలు ఇప్పుడు కొందరికే పరిమితమైన హక్కు కాదని, ప్రతి సామాన్య పౌరుడి హక్కుగా మారిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్య రెట్టింపు అయిందని, ఎంబీబీఎస్, పీజీ సీట్లను రికార్డు స్థాయిలో పెంచామని తెలిపారు. ‘పీజీఐఎంఈఆర్ చండీగఢ్’లో ఎంబీబీఎస్ కాలేజీకి ఆమోదం లభించిందని, త్వరలోనే అడ్మిషన్లు ప్రారంభమవుతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో దాదాపు 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సేవలందిస్తున్నాయని తెలిపారు
‘ఈ -సంజీవని’ మిషన్ ద్వారా ఇప్పటివరకు 48 కోట్లకు పైగా టెలిమెడిసిన్ సంప్రదింపులు జరిగాయని పేర్కొన్నారు. దేశంలో సంస్థాగత ప్రసవాలు 90 శాతానికి పైగా పెరిగాయని, మాతృ మరణాల రేటు 86 శాతం మేర తగ్గిందని ప్రధాని వెల్లడించారు. అలాగే, గత దశాబ్ద కాలంలో టీబీ కేసుల సంఖ్య 21 శాతం తగ్గిందని డబ్ల్యూహెచ్‌వో నివేదికను గుర్తుచేశారు. కరోనా విపత్కర సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ సహాయం అందించిందని, నేడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో రోగులు తీవ్ర వ్యాధుల చికిత్స కోసం భారత్‌కు వస్తున్నారని, తద్వారా దేశం ‘మెడికల్ టూరిజం’ హబ్‌గా మారుతోందని మోదీ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లాంటి భవిష్యత్తు రంగాల్లో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తొలి హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు..
దీన్ని నార్తర్న్ రైల్వేస్ పరిధిలో నడపనున్నారు. దీని మెయింటెనెన్స్ జింద్‌లోనే జరుగుతుంది.
ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలుగా రికార్డు సృష్టించింది. ఈ రైలులో ఒకేసారి 2,600 మంది ప్రయాణీకులు ప్రయాణించవచ్చు.
దీని గరిష్ట డిజైన్ వేగం గంటకు 110 కిలో మీటర్లు.
కాలుష్యం సున్నా.. కేవలం నీటి ఆవిరే బై-ప్రొడక్ట్. సాధారణ డీజిల్ ఇంజన్లలా కాకుండా, ఈ రైలు పూర్తిగా పర్యావరణహితంగా పనిచేస్తుంది.
రైలుపై అమర్చిన సిలిండర్లలోని హైడ్రోజన్, వాతావరణంలోని ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ విద్యుత్ ద్వారా మోటార్లు నడిచి రైలు చక్రాలు కదులుతాయి. ఈ ప్రక్రియలో ఎలాంటి పొగ, కార్బన్ ఉద్గారాలు రావు. కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే బయటకు వస్తాయి.
ఈ రైలు సెట్‌లో రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు, ఎనిమిది ట్రైలర్ కోచ్‌లు ఉన్నాయి. పవర్ కార్లలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు, హైడ్రోజన్ స్టోరేజ్ సిలిండర్లు అమర్చారు.
ఈ రైలు కోసం జింద్‌లో స్వదేశీ హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
