న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు హేతుబద్ధత లేని ఉచితాలు ప్రకటించే రాజకీయ పార్టీల గుర్తులను లేదా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టును కోరారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనాతో కూడిన ధర్మాసనానికి ఈ విషయాన్ని నివేదించారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా ఈ విజ్ఞప్తికి మద్దతు పలికారు. కాగా ప్రస్తుతం కోర్టులో కేసుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఈ వ్యవహారంపై కొద్దిరోజులు వేచి ఉండవచ్చని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ప్రభుత్వ ఖజానా నుంచి ఉచితాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఈ అనైతిక పద్ధతి ఓటర్లకు లంచాలు ఇవ్వడంతో సమానమని, ప్రజాస్వామ్య విలువలకు ఇది పెద్ద ముప్పని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం దీనిపై ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
