హైదరాబాద్, వెలుగు: టెట్ పరీక్షా విధానంలో లోపాలున్నాయనీ, వెంటనే సమీక్షించాలని టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కేంద్రాన్ని కోరారు. ప్రస్తుత టెట్ విధానం టీచర్ల అసలైన బోధనా సామర్థ్యాన్ని అంచనా వేసేలా లేదని విమర్శించారు. శుక్రవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. భాషా పండితులకు సోషల్ స్టడీస్ మీద, బయాలజీ టీచర్లకు లెక్కల మీద పరీక్షలు పెట్టడం సరికాదన్నారు.
సబ్జెక్టుతో సంబంధం లేని ప్రశ్నలు అడగడంతో టీచర్లు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని పేర్కొన్నారు. తమ సొంత సబ్జెక్టుపై పట్టు ఉన్నప్పటికీ, సంబంధం లేని ప్రశ్నల వల్ల జనరల్ కేటగిరీలో అర్హత మార్కులు సాధించలేకపోతున్నారని వివరించారు. కేంద్ర నిబంధనల ప్రకారం ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధించేవారే టెట్ రాయాలని, కానీ ప్రశ్నపత్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ స్థాయి సిలబస్ ఇస్తున్నారని గుర్తుచేశారు.
