సరూర్‌‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ‘యువ సంగ్రామ సదస్సు’కు హైకోర్టు అనుమతి

సరూర్‌‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ‘యువ సంగ్రామ సదస్సు’కు హైకోర్టు అనుమతి

హైదరాబాద్, వెలుగు: సరూర్‌‌నగర్ స్టేడియంలో ఈ నెల 18న బీఆర్ఎస్ నిర్వహించే యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 వరకు సదస్సు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ రద్దీకి అంతరాయం కలగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించింది. సదస్సుకు పోలీసు కమిషనర్ అనుమతి ఇవ్వకపోవడంతో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌‌రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. 

నిరుద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని, పార్కింగ్, సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లు చేసినా పోలీసులు స్పందించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివిధ విద్యార్థి సంఘాలు పాల్గొనే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల సమస్యలు, ట్రాఫిక్ ఇబ్బందులు రావచ్చని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, కొందరిపై పాత కేసులు ఉన్నాయనే కారణంతో అనుమతి నిరాకరించడం సరికాదని వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారం శాంతియుతంగా సదస్సు నిర్వహించుకునేందుకు సహకరించాలని పోలీసులను ఆదేశించారు.