హైదరాబాద్‌‌‌‌లో 850 కిలోల నెయ్యి సీజ్

హైదరాబాద్‌‌‌‌లో 850 కిలోల నెయ్యి సీజ్
  • మరో 60 కిలోల కుళ్లిన నెయ్యిని పారబోసిన అధికారులు  
  • పోలీసులతో కలిసి ఫుడ్ సేఫ్టీ బృందాల జాయింట్ ఆపరేషన్
  • రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో ముమ్మర తనిఖీలు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఏకంగా 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యి, క్రీమ్‌‌‌‌ను సీజ్ చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసుల సమన్వయంతో ఇటీవల క్యూర్ ఏరియాలోని 14  నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాల్లో అధికారులు ముమ్మర సోదాలు నిర్వహించారు. 

ఈ తనిఖీల్లో ల్యాబ్ పరీక్షల కోసం 15 నమూనాలను సేకరించిన అధికారులు, 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే తనిఖీల సందర్భంగా మానవ వినియోగానికి ఏమాత్రం పనికిరాని, అత్యంత కలుషితమైన మరో 60 కిలోల నెయ్యిని అక్కడికక్కడే పారబోయించారు. ల్యాబ్ నివేదికలు రాగానే నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తొలి విడతలో జిల్లాల్లో తనిఖీలు
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ తనిఖీలను రెండు విడతలుగా నిర్వహించారు. మొదటి విడతలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మినహా అన్ని జిల్లాల్లో, రెండో విడత హైదరాబాద్ క్యూర్ ఏరియాలో నిర్వహించారు. మొదటి విడత ప్రత్యేక డ్రైవ్‌‌‌‌‌‌‌‌లో జిల్లా ఫుడ్ సేఫ్టీ బృందాలు విస్తృతంగా సోదాలు చేశాయి. ఈ క్రమంలో మొత్తం 65 వ్యాపార సంస్థలను తనిఖీ చేసి, ల్యాబ్ టెస్ట్‌‌‌‌‌‌‌‌ కోసం 91 నెయ్యి, క్రీమ్ నమూనాలను సేకరించారు. తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు ఐదు సంస్థలకు నోటీసులు జారీ చేశారు. సేకరించిన నమూనాల ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.

లైసెన్స్ పొందిన వ్యాపారులూ కల్తీ చేస్తున్నారు

లైసెన్స్ ఉన్న వ్యక్తులు కూడా నెయ్యి కల్తీకి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 రూల్స్ ప్రకారం అసలైన నెయ్యిలో కనీసం 99.5 శాతం పాల కొవ్వు (మిల్క్ ఫ్యాట్) ఉండాలి. అలాగే తేమ శాతం 0.5 మించకూడదు. కొందరు లైసెన్స్ ఉన్న వ్యాపారులు కూడా నెయ్యిలో నాన్- మిల్క్ ఫ్యాట్స్‌‌‌‌‌‌‌‌ను కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొందరు ఎలాంటి రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండానే నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. నెయ్యిలో వనస్పతి, పామ్‌‌‌‌‌‌‌‌ ఆయిల్ వంటి వెజిటబుల్ ఫ్యాట్స్ కలపడం ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం నేరమని అధికారులు హెచ్చరించారు.

నెయ్యి కొనేముందు జాగ్రత్తలు తప్పనిసరి 

వినియోగదారులు కల్తీ నెయ్యి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ విభాగం సూచించింది. నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు కేవలం గుర్తింపు పొందిన, లైసెన్స్ ఉన్న సంస్థలనే ఎంచుకోవాలని కోరింది. కొనుగోలుకు ముందే ప్యాకెట్‌‌‌‌‌‌‌‌పై ఉండే ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఏఐ లైసెన్స్ నంబర్, ప్రొడక్ట్ లేబులింగ్ వివరాలను నిశితంగా పరిశీలించాలని స్పష్టం చేసింది. కొనుగోలు బిల్లులను తప్పనిసరిగా భద్రపరుచుకోవాలని, కల్తీ నెయ్యి తయారీ లేదా లైసెన్స్ లేని విక్రయాలపై అనుమానం వస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది.