ఒకప్పుడు దక్షిణాది చిత్రసీమలో తమ గ్లామర్, నటనతో ఒక ఊపు ఊపిన సీనియర్ నటీమణులు, అక్కాచెల్లెళ్లు అంబిక, రాధ. ఇప్పుడు ఈ అక్కాచెళ్లెళ్లు మధ్య ఆస్తి వివాదం చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. రెండు దశాబ్దాలుగా నడుస్తున్న కుటుంబ ఆస్తి తగాదాలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి. తాను సంతకం చేసిన ఖాళీగా ఉన్న చెక్కులను దొంగిలించి, రూ. 50.8 కోట్లు కాజేసేందుకు ప్రయత్నించారంటూ అక్క అంబిక, సోదరుడు మల్లికార్జునన్ (అర్జున్ నాయర్) పై నటి రాధ చెన్నై పోలీస్ కమిషననర్ ఆఫీస్‌లో సంచలన ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగింది?
చెన్నై వలసరవాక్కంలోని ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో రాధ నివసిస్తున్నారు. పోరూరులో ఉన్న 'ఆర్‌ఆర్ గార్డెన్' బిజినెస్ నిమిత్తం, కరెంట్ అకౌంట్‌కు చెందిన కొన్ని సైన్ చేసిన బ్లాంక్ చెక్కులను తన గదిలో ఉంచారు. షూటింగ్‌లు, పనుల నిమిత్తం రాధ తరచూ ముంబై, బెంగళూరు, కేరళ ప్రయాణిస్తుంటారు. ఇదే అవకాశంగా భావించి, అదే భవనంలో ఉంటున్న అక్క అంబిక, తమ్ముడు మల్లికార్జునన్ కలిసి రాధ గదిలోకి అక్రమంగా ప్రవేశించి ఆ పాత చెక్కులను కాజేశారని రాధ ఆరోపించారు.
బ్యాంక్ మెయిల్‌తో బయటపడ్డ ప్లాన్..
సెప్టెంబరు 17న IDBI బ్యాంక్ నుంచి ఓ ఈమెయిల్ వచ్చిందని రాధ తెలిపింది. అందులో అంబిక పేరు మీద రూ. 11 లక్షలు, రూ. 13.17 కోట్లు, రూ. 27.73 కోట్లు, రూ. 7 కోట్లు, రూ. 1.79 కోట్లు.. ఇలా మొత్తం రూ. 50.8 కోట్లకు సంబంధించి 5 పాత చెక్కులు ఎన్‌క్యాష్‌మెంట్‌కు వచ్చినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. అది చూసి షాకైన తక్షణమే స్టాప్ పేమెంట్ ఇచ్చి ఆ లావాదేవీలను అడ్డుకున్నానని రాధ చెప్పుకొచ్చారు..
ALSO READ : రేసింగ్ ట్రాక్ పై అజిత్ రికార్డు.. బార్సిలోనాలో భారత్ జెండా రెపరెపలు!
తన తమ్ముడు మల్లికార్జున్ ఫెమా (FEMA) కేసులో చిక్కుకుని భారీ పెనాల్టీ కట్టాల్సి రావడంతోనే, అక్క అంబికతో కలిసి ఈ కుట్ర పన్నాడని రాధ పేర్కొన్నారు. అంతేకాకుండా తన గదిలో ఉన్న బంగారం, వజ్రాభరణాలు, ఆస్తి పత్రాలను కూడా చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. ప్రస్తుతం చెన్నై పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు. ఒకప్పటి స్టార్ సిస్టర్స్ మధ్య ఈ స్థాయిలో రచ్చకెక్కడం కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
