గుజరాత్‌‌లో ఐదుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్

గుజరాత్‌‌లో ఐదుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్
  •     టైమ్ బాంబు కుట్ర భగ్నం
  •     18 మందికి చేరిన అరెస్టులు

అహ్మదాబాద్: గుజరాత్‌‌లో జైష్-ఎ -మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మరో ఐదుగురు అనుమానితులను ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వీరిలో ఒకడు టైమ్ బాంబును తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఖచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు, ఆ బాంబు తయారీ పూర్తి కాకముందే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో అరెస్ట్ అయిన వారి విచారణ ఆధారంగా ఈ ఐదుగురిని పట్టుకున్నారు. వీరికి పాకిస్తాన్ హ్యాండ్లర్ల నుంచి ఆర్థిక సాయం అందుతోందని వెల్లడైంది. 

నిందితులు ఐఈడీ పేలుడు పదార్థాలను పరీక్షించే పనుల్లో నిమగ్నమయ్యారు. గతంలో వారు చేసిన ఓ బాంబు ప్రయోగం విఫలమైందని కోర్టుకు అధికారులు తెలిపారు.'దారుల్ ఇస్లాం గుజరాత్ జైష్-ఎ -మొహమ్మద్' స్లీపర్ సెల్‌‌పై జరిగిన ఈ మూడో విడత దాడులతో మొత్తం అరెస్టుల సంఖ్య 18కి చేరింది. స్థానిక యువకులను ఆకర్షించడం, నిధులు సేకరించడం కోసం వీరు పాకిస్తాన్ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఏటీఎస్ ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నిఘా సంస్థలతో కలిసి మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలిస్తోంది.