ఆర్వో నిర్ణయం తర్వాత మేమేం చేయలేం..మీనాక్షి నటరాజన్ విషయంలో ఆమెకు తగిన సమయం ఇచ్చారు: సీఈసీ జ్ఞానేశ్‌‌కుమార్

ఆర్వో నిర్ణయం తర్వాత మేమేం చేయలేం..మీనాక్షి నటరాజన్ విషయంలో ఆమెకు తగిన సమయం ఇచ్చారు: సీఈసీ జ్ఞానేశ్‌‌కుమార్
  • సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లున్నా ‘సర్’తో పోతయ్‌‌
  • ఇక దేశంలో ఎక్కడా డబుల్ ఓట్లు ఉండే అవకాశమే లేదని వెల్లడి

హైదరాబాద్ , వెలుగు: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే, వారు ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని చీఫ్‌‌ ఎలక్షన్‌‌ కమిషనర్‌‌ (సీఈసీ)‌‌ జ్ఞానేశ్‌‌ కుమార్​ తెలిపారు.  ఫామ్స్ నింపే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పారదర్శకంగా వ్యవహరించాలని, చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తుచేశారు.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై జ్ఞానేశ్‌‌ కుమార్ స్పందించారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్టబద్ధమైనదని, నిబంధనల ఉల్లంఘన జరిగినప్పుడు ఇలాంటి పరిణామాలు సహజమేనని వివరించారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో పొందుపరిచిన ప్రతి ఒక్క కాలమ్‌‌ను తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కోర్టు కేసుల వివరాలను నామినేషన్ పత్రంలో స్పష్టంగా భర్తీ చేయాల్సి ఉందని, దీనికోసం మీనాక్షికి రిటర్నింగ్ అధికారి తగిన సమయం కూడా ఇచ్చారని వెల్లడించారు. అయినప్పటికీ లభించిన సమయాన్ని ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయారని వివరించారు.  

ప్రత్యర్థులు వదిలిపెట్టరు 

కొన్ని సందర్భాల్లో ఎన్నికల అధికారులు మానవీయ కోణంలోనో లేదా పొరపాటునో చిన్నచిన్న లోపాలను చూసీచూడనట్లు వదిలేసినా, ప్రత్యర్థులు మాత్రం దాన్ని అస్సలు వదులుకోరని సీఈసీ జ్ఞానేశ్‌‌ కుమార్​ వ్యాఖ్యానించారు.  మీనాక్షి నటరాజన్ విషయంలో కూడా రాజకీయ ప్రత్యర్థులు ఫిర్యాదు చేయకపోతే బహుశా పరిస్థితి మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డారు. అయితే, ఒకసారి ప్రత్యర్థుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదు అందిన తర్వాత రిటర్నింగ్ అధికారి చట్టప్రకారం నిర్ణయం తీసుకోక తప్పదని చెప్పారు.

సుప్రీంకోర్టు సైతం రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్నే పూర్తిగా సమర్థించిందని, ఎన్నికల నిబంధనల విషయంలో ఆర్వో పరిధిని కోర్టు సైతం గౌరవించిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో రెండు ఓట్లు ఉన్నాయనే అంశంపై స్పందిస్తూ, ప్రస్తుతం అమలు చేస్తున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) ప్రక్రియ ద్వారా ఇకపై దేశంలో ఎక్కడా డబుల్ ఓట్లు ఉండే అవకాశం లేదని తేల్చిచెప్పారు.  రేవంత్ రెడ్డి రెండు ఓట్ల సమస్య కూడా ఈ ‘సర్‌‌’‌‌ ప్రక్రియతో పూర్తిగా పరిష్కారమవుతుందని, ఇకపై అలాంటి గందరగోళాలకు తావుండదని తెలిపారు.