హైదరాబాద్: భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన దేశీయ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్–-1’ (టెస్ట్ ఫ్లైట్-1) శనివారం నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘వందేమాతరం’ అని చేతిరాతతో రాసిన ఒక పోస్ట్‌కార్డ్‌ను రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించనున్నారు.
ఈ విషయాన్ని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘ఎక్స్’లో వెల్లడించింది. ప్రధాని మోదీ సందేశంతో పాటు స్కైరూట్ బృంద సభ్యులు, ఇన్వెస్టర్లు, పాలసీ మేకర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రేయోభిలాషులు రాసిన పోస్ట్‌కార్డులను కూడా నింగిలోకి పంపించనున్నట్టు సంస్థ తెలిపింది. స్కైరూట్ చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు పెట్టారు.
