- లీకేజీలతో ఇప్పటిదాకా 7.5 కోట్ల మంది స్టూడెంట్లు నష్టపోయారు
- రెస్టారెంట్లలో ఫుడ్ మెనూలాగే పరీక్షలను ఎంచుకుని లీక్ చేస్తున్నరు
- లీక్ మీద లీక్ జరిగినా ఒక్క దోషికీ శిక్ష పడలేదు
- పేద, మధ్య తరగతి పాలిట శాపంగా పేపర్ లీకేజీలు
- ప్రతి 150 మంది యువకుల్లో ఒక్కరికి మాత్రమే జాబ్
- విద్యార్థుల కన్నీళ్లకు కర్మ అనుభవించక తప్పదని వార్నింగ్
- డెహ్రాడూన్ సిటీలో 'ఛాత్రోంకీ గూంజ్' సభకు భారీగా జనం
డెహ్రాడూన్: దేశ విద్యా వ్యవస్థలో పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకున్న అధికారులంతా పేపర్ లీకేజీల్లోనే నిమగ్నమయ్యారని లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. క్వశ్చన్ పేపర్ల లీకేజీలతో ఇప్పటివరకు 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. రెస్టారెంట్లలో ఫుడ్ మెనూ కార్డ్ ఉన్నట్లే.. ఇప్పుడు వివిధ పరీక్షల పేపర్ల కోసం ప్రత్యేక రేట్లతో మెనూ కార్డ్స్ అందుబాటులో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఇంతజరుగుతున్నా ఇప్పటిదాకా ఒక్క దోషికీ శిక్ష పడలేదన్నారు.
విద్యాసంస్థలు ఏ రాజకీయ పార్టీకి వంతపాడకూడదని, అవి స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. శుక్రవారం ఆయన ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ సిటీలో నిర్వహించిన ‘ఛాత్రోన్ కి గూంజ్(విద్యార్థుల గొంతు)’ సభలో మాట్లాడారు. ‘విద్యాసంస్థలకు నాయకత్వం వహించే వైస్ ఛాన్సలర్లు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి, భావజాలానికి అనుకూలంగా ఉండకూడదు. కేవలం అర్హత, అనుభవం, విద్యా రంగంలో ఉన్న ప్రతిభ ఆధారంగానే వైస్ ఛాన్సలర్లు ఎంపిక కావాలి. విద్యా సంస్థలు పూర్తి స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలి. కేవలం 1 శాతం డబ్బు, పలుకుబడి ఉన్న విద్యార్థులు పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారు. దీనివల్ల 99 శాతం మంది నిజాయితీపరులైన పేద, మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ ఏకాభిప్రాయం అవసరం
పేపర్ లీకేజీల కోసం కొందరు అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. కోట్ల డబ్బు ఉంటే చాలు.. మెనూ కార్డ్ నుంచి కావాల్సిన పేపర్‌ను ఎంచుకుని ముందే తెప్పించుకుంటున్నారని మండిపడ్డారు. పేపర్ లీక్ ముఠాను అంతం చేయడానికి రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కేంద్రీకృత పరీక్షా విధానం నుంచి విద్యార్థి కేంద్రీకృత, సురక్షితమైన, రాజకీయ ప్రమేయం లేని వ్యవస్థకు మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. ర్యాండమైజ్డ్ ప్రశ్నపత్రాల వంటి ఆధునిక పరీక్షా నమూనాను ప్రతిపాదించారు. జీమ్యాట్, సాట్ వంటి పరీక్షల మాదిరిగానే.. ఒకే పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇవ్వాలని, అందరినీ ఒకే రోజున పరీక్షకు కూర్చోబెట్టేలా ఒత్తిడి చేయకుండా ఫ్లెక్సిబిలిటీ ఉండాలని సూచించారు. పరీక్షల నిర్వహణను అవుట్‌సోర్సింగ్ చేయడాన్ని రాహుల్ వ్యతిరేకించారు. పరీక్షల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టంచేశారు. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధిస్తూ, వెంటనే రీ-ఎగ్జామినేషన్ నిర్వహించడం, నష్టపోయిన విద్యార్థులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
యువత ప్రధాన సమస్యలివే..
యువత ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన సమస్యల్లో పేపర్ లీకేజీలు ఒకటని రాహుల్ అభిప్రాయపడ్డారు. పరీక్షల కోసం సిద్ధమవ్వడానికయ్యే ఖర్చు, ప్రభుత్వేతర రంగంలో తగ్గుతున్న ఉపాధి అవకాశాలు, కష్టపడినా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉండటం వంటివి మిగిలిన సమస్యలని వివరించారు. పరీక్షల కోసం పిల్లలను సిద్ధం చేసే క్రమంలో కుటుంబాలు ఐదేళ్లలో రూ.9 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న దాదాపు తొమ్మిది కోట్ల మందిలో.. కేవలం ఆరు లక్షల మంది మాత్రమే విజయం సాధిస్తున్నారని చెప్పారు. అంటే ప్రతి 150 మంది యువకులలో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం లభిస్తోందని తెలిపారు. టెలిగ్రామ్, సిగ్నల్ వంటి సాంకేతిక వేదికలను లీక్ అయిన పేపర్లను షేర్ చేయడానికి వాడుతున్నారని, దీన్ని ఒక మహమ్మారిగా రాహుల్ అభివర్ణించారు. ఇప్పటివరకు 152 కంటే ఎక్కువ పోటీ పరీక్షలు లీక్ అయ్యాయని.. ఇప్పటివరకు ఎవరికీ శిక్ష పడలేదని ఆరోపించారు.
వర్షం పడుతున్నా తరలివచ్చిన జనం
భారీ వర్షం కురిసినప్పటికీ రాహుల్ గాంధీ సభకు 10 వేలకు పైగా ప్రజలు హాజరయ్యారు. వేదికపైకి రాహుల్ గాంధీ వచ్చే ముందు.. విద్యార్థుల కన్నీళ్లకు కర్మ అనుభవించక తప్పదని పెద్ద స్క్రీన్‌పై వార్నింగ్ మెసేజ్ కనిపించింది. ఇది విద్యార్థుల భవిష్యత్తు పట్ల బీజేపీ ప్రభుత్వం చూపుతున్న అలసత్వానికి కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని సూచించేందుకు ఏర్పాటు చేశారు
