న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్ల భరోసా..తెలంగాణ ప్రభుత్వ చొరవపై సుప్రీం కోర్టు ప్రశంసలు

న్యాయవాదుల సంక్షేమానికి  రూ. 100 కోట్ల భరోసా..తెలంగాణ ప్రభుత్వ చొరవపై సుప్రీం కోర్టు ప్రశంసలు
  • మహిళా అడ్వకేట్ల వసతులపై ఫోకస్ చేయాలని సూచన

న్యూఢిల్లీ, వెలుగు: న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సుప్రీం కోర్టు అభినందించింది. అడ్వొకేట్ల కోసం రూ.100 కోట్ల శాశ్వత సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా మహిళా అడ్వొకేట్లు ఎదుర్కొంటున్న సమస్యలపై దాఖలైన రిట్ పిటిషన్‌‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్ లతో కూడిన బెంచ్ శుక్రవారం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్ రెడ్డి.. రాష్ట్రంలోని న్యాయవాదుల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ఎనిమిది పేజీల అఫిడవిట్‌‌ను ధర్మాసనానికి సమర్పించారు. తెలంగాణ అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా రూ.100 కోట్లను కార్పస్ ఫండ్‌‌గా డిపాజిట్ చేశామని, 50 వేల మంది న్యాయవాదులకు రూ.2 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల ప్రమాద బీమాను ప్రభుత్వమే భరిస్తోందని వివరించారు. దీనిపై కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. 

అయితే, ఈ కేసు ముఖ్యంగా యువ మహిళా న్యాయవాదుల వసతులపై ఉన్నందునా., వారి కోసం ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయాలను కూడా వివరించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రాల్లోని హైకోర్టులు, కింది కోర్టుల్లో ఉన్న వసతులను మానిటరింగ్ చేయాలని అన్ని రాష్ట్రాల ఏజీలకు సూచించింది. మహిళా న్యాయవాదులకు సౌకర్యాల కల్పన, వృత్తిలో వారు స్థిరపడేందుకు చేపడుతున్న చర్యలపై సమగ్ర రిపోర్ట్‌‌ను ఆరు వారాల్లోగా అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అవసరమైతే అటార్నీ జనరల్ అన్ని రాష్ట్రాల ఏజీలతో సమన్వయం చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొంది.