- మొత్తం 4.37 లక్షల సీట్లలో నిండినవి 1.41 లక్షలే
- ప్రైవేట్, రెసిడెన్షియల్ కాలేజీల్లో దారుణంగా అడ్మిషన్లు
- ఈ నెల 20 నుంచి ‘దోస్త్’ స్పెషల్ ఫేజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లు అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. మొత్తం 929 కాలేజీల్లో 4,37,809 సీట్లు ఉండగా, ఇప్పటివరకు 1,41,143 (32 శాతం) సీట్లు మాత్రమే నిండాయి. మిగిలిన 68 శాతం అంటే 2,96,666 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 580 ప్రైవేట్ కాలేజీల్లోని 2.48 లక్షల సీట్లలో కేవలం 59,615 మంది చేరగా, 1,88,715 సీట్లు భర్తీ కాలేదు. 116 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని 50,940 సీట్లలో 19,389 సీట్లు నిండాయి. వర్సిటీ, అటానమస్ కాలేజీల్లో సగానికి పైగా భర్తీ కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ కాలేజీల్లోని 23,834 సీట్లలో 14,563 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
20 నుంచి ‘దోస్త్’ స్పెషల్ ఫేజ్
డిగ్రీ ప్రవేశాల ‘దోస్త్’ స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైందని టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ నెల 20 నుండి 26 వరకు రిజిస్ట్రేషన్లు, 27 వరకు వెబ్ ఆప్షన్లకు ఛాన్స్ ఇచ్చారు. ఈ నెల 30న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు ఈ నెల 30 నుంచి ఆగస్టు 1 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ఈ నెల 31 నుంచి ఆగస్టు 1 లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.
