హైదరాబాద్, వెలుగు: "ఈశ్వరమ్మ వివాదం మా కాంగ్రెస్ అంతర్గత అంశం. మా ఇంటి పంచాయితీతో వేరే పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఏం సంబంధం?" అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వైటీడీఏ సభ్యురాలైన ఈశ్వరమ్మను మర్యాదపూర్వకంగా పరామర్శించాల్సింది పోయి, తలసాని అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు పదవి ఇచ్చి గౌరవిస్తే, ఈ చిన్న విషయాన్ని రెడ్డి వర్గానికి ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి కోసం తలసాని వాడుకుంటున్నారని విమర్శించారు.యాదవుల మధ్య చిచ్చుపెట్టి, వారిని బీఆర్ఎస్ వైపు తిప్పుకోవడానికే తలసాని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు నిన్ను తిట్టినప్పుడు ఎందుకు నోరు మెదపలేదని తలసానిని నిలదీశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
