- ఈ డేటాను ఎన్నికల ప్రయోజనాల కోసమే ఉపయోగించాలి
- సంక్షేమ పథకాల అమలులో దీన్ని వాడొద్దని కామెంట్
- బెంగాల్‌లో లక్షలాది మంది పేర్లను తొలగించారన్న కేసులో విచారణ
న్యూఢిల్లీ: ఓటర్ల స్పెషల్ఇంటెన్సివ్రివిజన్(సర్)కు సంబంధించి సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితా నుంచి ఒక వ్యక్తి పేరును తొలగించినంత మాత్రాన, ఆ వ్యక్తి భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోయినట్టు కాదని స్పష్టం చేసింది. బెంగాల్ కాంగ్రెస్ కమిటీకి చెందిన ‘సర్’ కమిటీ చైర్‌పర్సన్ ప్రసేన్‌జిత్ బోస్ సుప్రీంకోర్టులో ఓ పిల్ ను దాఖలు చేశారు. బెంగాల్‌లో సర్ ప్రక్రియలో లక్షలాది మంది పేర్లను తొలగించారని, దీనిపై బాధితులు అప్పీలేట్ ట్రిబ్యునళ్లలో దాదాపు 34 లక్షల అప్పీళ్లు దాఖలు చేయగా, ఇప్పటివరకు కేవలం 38 వేల అప్పీళ్లను మాత్రమే విచారించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ పూర్తయిన కేసులలో దాదాపు 70% మంది అప్పీళ్లను ట్రిబ్యునళ్లు అంగీకరించాయని.. వారిని మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చారని తెలిపారు. మిగిలిన లక్షలాది మంది అప్పీళ్లు పెండింగ్‌లో ఉండటం వల్ల బెంగాల్ ప్రభుత్వం పేదలు, వెనుకబడిన వర్గాల వారిని రేషన్, అన్నపూర్ణ యోజన తదితర లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారని తెలిపాడు.
ఈ కేసును సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా మే 27న బిహార్ సర్ కేసులో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తుచేసింది. ‘సర్ డేటాను కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇతర సంక్షేమ పథకాల అమలులో ఈ డేటాను ఉపయోగించి ప్రజలకు లబ్ధిని నిరాకరించకూడదు’ అని పేర్కొంది. జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి మాట్లాడుతూ.. పౌరసత్వాన్ని నిర్ధారించడానికి ఎన్నికల సంఘం సర్ డేటాను ఉపయోగించకూడదని మే 27 నాటి తీర్పు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఒకవేళ పౌరసత్వానికి సంబంధించిన సందేహాలు ఉంటే, ఆ విషయాన్ని తదుపరి విచారణ కోసం పౌరసత్వ చట్టం కింద ప్రభుత్వానికి అప్పగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈ తీవ్రమైన సమస్యపై స్పందించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం, బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
భూ రికార్డులు సిటిజన్షిప్కు రుజువు కాదు..
భూమి రికార్డులు భారతీయ పౌరసత్వానికి రుజువులు కావని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డాడనే ఆరోపణతో గత జూన్లో బెంగాల్‌లో అదుపులోకి తీసుకున్న నాసిర్ మొల్లా అనే వ్యక్తి దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
