హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పనిచేస్తున్న పంచాయతీ సెక్రటరీల పూర్తి డేటాను సర్కార్ సేకరిస్తోంది. గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3, గ్రేడ్-4 కార్యదర్శుల సమాచారాన్ని ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లోని ఈ-హెచ్ఆర్ఎంఎస్తో అనుసంధానం (మ్యాపింగ్) చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీవో) కమిషనర్ ఆఫీస్ నుంచి మెమో వెళ్లింది. జిల్లా అధికారులు తమ పరిధిలో ఉన్న పంచాయతీ సెక్రటరీల వివరాలను గ్రేడ్‌ల వారీగా సేకరించి, ప్రభుత్వం ఇచ్చిన ఫార్మాట్‌లో పంపాలని ఆదేశించారు.
ఈ పనిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ మ్యాపింగ్ పూర్తయితే పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ రికార్డులు పూర్తిగా ఆన్‌లైన్‌లోకి వస్తాయి. దీంతో జీతాలు, సెలవులు, పదోన్నతులు, బదిలీలు, ఇతర సర్వీస్ అంశాలను సులభంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పంచాయతీ అధికారులు తమ పరిధిలోని సెక్రటరీల వివరాలను గ్రేడ్‌ల వారీగా నిర్ణీత ఫార్మాట్‌లో cpr.ps.section@gmail.com మెయిల్ ఐడీకి పంపాలని కమిషనర్ ఆదేశించారు.
