జలగం ప్రసాదరావు భద్రత ఉపసంహరణ సబబే ..రిట్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు

జలగం ప్రసాదరావు భద్రత ఉపసంహరణ సబబే ..రిట్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావుకు వ్యక్తిగత భద్రతను ఉపసంహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడైన ప్రసాద్‌రావు గతంలో మంత్రిగా పనిచేశారు.

నక్సలైట్ల నుంచి తమ కుటుంబానికి ముప్పు ఉందని, బెదిరింపు కాల్స్ వస్తున్నందున తన '1+1' భద్రతను పునరుద్ధరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భద్రత కల్పించడం అనేది నిఘా వర్గాల ముప్పు అంచనా నివేదికల ఆధారంగా తీసుకునే నిర్ణయమని తెలిపారు. తాజా నివేదికల ప్రకారం ప్రసాద్‌రావుకు మావోయిస్టుల నుంచి ఎలాంటి ముప్పు లేదని, ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా లేరని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. నివేదికలను పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది