- యాదగిరిగుట్ట, కొలనుపాక, మెదక్ పోర్ట్, బస్వాపూర్, నారాయణపేటలోని మూడుమాల్, రామప్ప, గద్వాల కోట ఎంపిక
- కేంద్ర ‘స్వదేశీ దర్శన్’ పథకం కింద వంద శాతం నిధులు మంజూరు
- ఇప్పటికే భువనగిరి రోప్‌వే, అనంతగిరిలో టెంటెడ్ కాటేజీ పనులు వేగవంతం
- డిసెంబర్ లోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్లాన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘స్వదేశీ దర్శన్’ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ రాష్ట్రంలోని ఏడు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రెడీ చేసింది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట, జైనుల చారిత్రక ఆలయం కొలనుపాక, చారిత్రక వైభవానికి ప్రతీక అయిన మెదక్ ఖిల్లా, బస్వాపూర్ రిజర్వాయర్, నారాయణపేట జిల్లాలోని మహాశిలా యుగం నాటి నిలువు రాళ్ల కేంద్రం మూడుమాల్తో పాటు గద్వాల కోట, రామప్ప పరిసరాల్లోని అనుబంధ ప్రాంతాలను ఈ జాబితాలో చేర్చినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే పనులు ప్రారంభమైన భువనగిరి రోప్‌వే, వికారాబాద్ అనంతగిరి కొండల్లో టెంటెడ్ కాటేజీ(గ్లాంపింగ్) పనులను త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబరు నాటికే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కార్యాచరణ రూపొందించారు.
పర్యాటక ప్రాంతాల ఎంపిక ఇలా..
కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ‘స్వదేశీ దర్శన్’ పథకం కింద పర్యాటక ప్రాంతాల ఎంపికకు కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు ఆ ప్రదేశానికి ఎంత వరకు ఉన్నాయనేది లెక్కిస్తారు. పురాతన కట్టడాలు, వారసత్వ సంపద, ప్రత్యేక భౌగోళిక లేదా ఆధ్యాత్మిక విశిష్టతలు ఉన్న ప్రాంతాలకు తొలి ప్రాధాన్యమిస్తారు. ప్రధాన నగరాలు, రహదారుల నుంచి రవాణా సౌకర్యాలు, పర్యాటకులు బస చేసేందుకు అనువైన స్థలాలు అందుబాటులో ఉన్నాయా? అనేది పరిశీలిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ఉండడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలపై ఫోకస్ చేస్తారు.
వంద శాతం నిధులు.. అత్యాధునిక వసతులు
స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద చేపట్టే నిర్దేశిత ప్రాజెక్టులకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వంద శాతం నిధులను మంజూరు చేస్తుంది. స్థానికంగా భూసేకరణ, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, విద్యుత్, నీటి సరఫరా వంటి ప్రాథమిక బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. ఒక్కో పర్యాటక ప్రాంతం లేదా క్లస్టర్ అభివృద్ధికి రూ.50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వరకు నిధులను కేటాయించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడానికి రోడ్లు, పార్కింగ్ స్థలాలు, పర్యాటకులు బస చేయడానికి గెస్ట్ హౌస్‌లు, హోటళ్లు, కాటేజీలు నిర్మించనున్నారు. తాగునీరు, అత్యాధునిక మరుగుదొడ్లు, ఫుడ్ కోర్టులు, వైఫై సౌకర్యం, ల్యాండ్ స్కేపింగ్, గార్డెన్స్, మ్యూజికల్ ఫౌంటైన్లు, లైటింగ్ తదితర వసతులు కల్పించనున్నారు. ఆయా ప్రాంతాల చరిత్రను వివరించేందుకు ఇంటర్ ప్రిటేషన్ సెంటర్లు, సౌండ్ అండ్ లైట్ షోలు, పర్యాటకుల రక్షణ కోసం సీసీ కెమెరాలు, టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు.
24 నెలల గడువు.. టార్గెట్ డిసెంబరే..
స్వదేశీ దర్శన్ పథకం కింద మంజూరైన పనులను పూర్తి చేయడానికి కేంద్ర పర్యాటక శాఖ సాధారణంగా 24 నెలల గడువును విధిస్తుంది. కాగా, ఇప్పటికే భువనగిరి కోట పరిసరాల అభివృద్ధి కోసం ‘భువనగిరి ఫోర్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్’ ప్రాజెక్టు కింద కేంద్రం రూ.56.81 కోట్లు మంజూరు చేసింది. పర్యాటకులకు త్వరగా ఈ సేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో టీజీటీడీసీ పనులను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే మొదలైన ప్రాజెక్టులను గడువు కంటే ముందే.. డిసెంబరు నాటికే పూర్తి చేయాలనే పట్టుదలతో పని చేస్తోంది. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి రోప్‌వే. హైదరాబాద్, -వరంగల్ జాతీయ రహదారి నుంచి కోట వద్దకు దాదాపు కిలోమీటరు దూరం వరకు ఈ రోప్‌వే నిర్మిస్తున్నారు. రోప్‌వే పిల్లర్ల నిర్మాణం, బేస్ క్యాంప్ కోసం రైతుల నుంచి సుమారు ఎకరం రెండు గుంటల భూమిని సేకరించి, వారికి పరిహారం చెల్లించారు. ప్రస్తుతం పిల్లర్లు, బేస్ క్యాంప్ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
అడవి అందాల నడుమ.. అనంతగిరిలో ‘గ్లాంపింగ్’
తెలంగాణ ఊటీగా పిలిచే వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌ను సరికొత్త టూరిజం హబ్‌గా మార్చేందుకు గ్లాంపింగ్(టెంటెడ్ హౌస్‌ల నిర్మాణం) ప్రాజెక్టును చేపట్టారు. అడవి అందాల నడుమ 18 ఎకరాల్లో గ్లాంపింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అనంతగిరిలో ఎకో టూరిజం, తాగునీటి సరఫరా, గ్లాంపింగ్ వంటి అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.38 కోట్ల నిధులను కేటాయించారు.
మొత్తం 89 టెంటెడ్ హౌస్‌లను నిర్మిస్తున్నారు. ఒక్కో టెంట్ నిర్మాణానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. సాధారణ హోటల్ గదుల తరహాలోనే ఇక్కడ బెడ్‌రూమ్, అటాచ్డ్ బాత్‌రూమ్, చిన్న కిచెన్ వంటి వసతులు ఉంటాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా, ప్రకృతి ఒడిలో పర్యాటకులు సురక్షితంగా బస చేసేలా పర్యావరణ అనుకూల టెంట్లను తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తయితే తెలంగాణ పర్యాటకరంగానికి సరికొత్త శోభ చేకూరడంతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
