- మిషన్ భగీరథ, హైదరాబాద్ జలమండలి నీటి సరఫరాపై పెను ప్రభావం
- రోజుకు 750 ఎంఎల్డీకి గాను 550 ఎంఎల్‌డీలే పంపిణీ
- గ్రామాలు, పట్టణాల్లో కలిపి వెయ్యి మిలియన్ గ్యాలన్ల వాటర్ సప్లై
- మూడు రోజులకోసారే నల్లాలువానలు పడి ఇన్‌ఫ్లో పెరిగితేనే
- ఇరిగేషన్‌కు వాటర్ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తాగునీటి గండం ముంచుకొస్తున్నది. వర్షాలు లేక గోదావరి, కృష్ణా నదులు వెలవెలబోతున్నాయి. మిషన్ భగీరథ, హైదరాబాద్ జలమండలి స్కీమ్‌లకు తాగునీరందించే రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీలోకి వెళ్లిపోయాయి. మరో వైపు భూగర్భ జలాలు సైతం అంతకంతకూ పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు కురవకుంటే తాగునీటికి గడ్డు పరిస్థితులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నీటి కటకటతో మిషన్ భగీరథ, హైదరాబాద్ జలమండలి స్కీమ్‌లపై పెను ప్రభావం పడుతోంది. క్యూర్ పరిధిలోని మూడు గ్రేటర్ కార్పొరేషన్ల పరిధిలో రోజుకు 750 మిలియన్ గ్యాలన్ల నీటికి గానూ కేవలం 550 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాలలో కలిపి రోజు 1,500 మిలియన్ గ్యాలన్లకు కేవలం వెయ్యి గ్యాలన్ల నీటిని మాత్రమే సప్లై చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్‌వాటర్ పడిపోతోంది. రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 9.34 మీటర్ల దిగువకు చేరింది. దీంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య మొదలైంది.
రోజు విడిచి రోజు వచ్చే నల్లాలు మూడు రోజులకోసారీ సరిగ్గా రావడం లేదు. నల్లా నీళ్లు అందక ప్రజలు గోస పడుతున్నారు. ప్రజలు బిందెలు పట్టుకొని మళ్లీ బావులు, కుళాయిలు దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దీంతో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వానలు పడి ఇన్‌ఫ్లో పెరిగితేనే ఇరిగేషన్‌కు రిజర్వాయర్ల నుంచి వాటర్ రిలీజ్ చేయాలని, ఇప్పటికే ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకోసం నిల్వ చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే, గ్రామాలు, పట్టణాల్లో అద్దె బావులు, బోర్లు తీసుకొని ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేయాలని సూచించింది.
రిజర్వాయర్లలో తగ్గిపోతున్న నీటిమట్టాలు
రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, ఇతర నదులపై నిర్మించిన రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1,059 టీఎంసీలు. వీటి ఆధారంగానే రాష్ట్రంలో మిషన్ భగీరథ, హైదరాబాద్ జలమండలి నీటి స్కీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి వ్యక్తికి గ్రామాల్లో 100 లీటర్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 130 లీటర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 లీటర్ల చొప్పున వాటర్ సప్లయ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం యేటా 72 టీఎంసీల నీటిని ఉపయోగిస్తున్నారు. కేంద్ర జలసంఘం, రాష్ట్ర నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం గురువారం నాటికి 31.53 శాతం అనగా 334.04 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు పదేండ్ల కనిష్ఠానికి పడిపోయాయి. గతేడాది ఇదే సమయానికి 522.31 టీఎంసీల నీటి నిల్వలు ఉండేవి. ప్రస్తుతం 188.27 టీఎంసీల లోటు ఉండడంతో సాగు, తాగునీటిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ముఖ్యంగా తాగు నీరందించే కీలకమైన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, జూరాల, కడెం, లోయర్ మానేరు, నిజాంసాగర్, సింగూరు, మూసీ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు సూచిస్తున్నాయి. వీటిలో 12.92% నీరు మాత్రమే నిల్వ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో వరద రాకుంటే రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి ఎద్దడి తీవ్రమయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌లో రోజుకు 750 ఎంఎల్డీకి గాను 550 ఎంఎల్‌డీలే సప్లై
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే 1.30 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరికి జలమండలి ఆధ్వర్యంలో ప్రతీ రోజు తాగునీరు అందిస్తున్నారు. క్యూర్ పరిధిలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఏరియాలలో నివసిస్తున్న ప్రజలకు ప్రతి రోజు 750 మిలియన్ గ్యాలన్ల(ఎంఎల్డీ) వాటర్ సప్లై చేయాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితులలో ఆఫీసర్లు కేవలం 550 ఎంఎల్డీల వాటర్ మాత్రమే సప్లై చేస్తున్నారు. హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి, సింగూర్, మంజీరా నదులతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి నీటిని సేకరించి నగరానికి తరలిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా వాటర్ లేకపోవడంతో రోజు విడిచి రోజుకు బదులు మూడురోజులకోసారి నల్లానీరు సప్లై చేస్తున్నారు.
రోజుకు 11 వేలకు పైగా వాటర్ ట్యాంకర్ బుకింగ్స్
మరోవైపు భూగర్భజలాలు పడిపోవడంతో వేలాది బోర్లు ఎండిపోయాయి. దీంతో అపార్ట్మెంట్లు, ఫ్లాట్ల నుంచి వాటర్ ట్యాంకర్ బుకింగ్స్ పెరిగిపోయాయి. రోజుకు 11 వేలకు పైగా వాటర్ ట్యాంకర్ బుకింగ్స్ వస్తున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. కుత్బుల్లాపూర్, అల్వాల్, కాప్రా వంటి శివారు ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావం, భూగర్భ జలాలు అడుగంటడం వల్ల తాగునీటి సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ‘సింగూర్, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో పూర్తి స్థాయి ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలని, నీటి కొరత ఉన్న ప్రాంతాలకు కృష్ణా, గోదావరి, మిషన్ భగీరథ వ్యవస్థల నుండి నీటిని మళ్లించాలని హైదరాబాద్ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సిబ్బందిని ఇప్పటికే ఆదేశించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల దాహార్తిని తీర్చడానికి మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. రోజుకు సుమారు 0.23 టీఎంసీలు అనగా 2,700 క్యూసెక్కులు లేదా 1,500 మిలియన్ గ్యాలన్లు(ఎంజీడీ) వాటర్ సప్లై చేయాలి. కానీ, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జలాశయాల్లో నీరు అడుగంటడంతో ప్రస్తుతం రోజుకు సగటున 0.12 నుండి 0.15 టీఎంసీల వాటర్ (వెయ్యి గ్యాలన్ల) క్లీన్ చేసి సరఫరా చేయగలుగుతున్నారు. వానలు పడి ఎగువ నుంచి వరద రాకపోతే ఈ ప్రాజెక్టుల కింద తాగునీటి కష్టాలు తప్పని పరిస్థితి నెలకొన్నది.
ఇప్పటికైతే ఇరిగేషన్‌కు నో..
రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదిపై ఏర్పాటు చేసిన రిజర్వాయర్లలో నీటి మట్టాలు అడుగంటడంతో నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. వర్షాలు పడి రిజర్వాయర్లలోకి ఇన్‌ఫ్లో పెరిగితే తప్ప ఇరిగేషన్‌కు నీటిని విడుదల చేయవద్దని స్పష్టంచేసింది. దీంతో ప్రస్తుతం అత్యవసరంగా ఎమర్జెన్సీ పంపింగ్ సిస్టమ్స్ (మోటార్లు) ఏర్పాటు చేసి మిషన్ భగీరథ ఇన్‌టేక్ వెల్స్ లోకి నీటిని మళ్లిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల తాగునీటి కోసం సింగూరు, మంజీరా రిజర్వాయర్లపై ఆధారపడటం తగ్గించి, అందుబాటులో ఉన్న గోదావరి, కృష్ణా బేసిన్ల నుంచి ప్రత్యామ్నాయ లైన్ల ద్వారా తరలిస్తున్నారు. నదుల్లో నీటి ప్రవాహం పెరిగే వరకు స్థానిక పెద్ద చెరువులు, మిషన్ భగీరథ ప్రత్యేక బోరుబావుల ద్వారా నీటిని సేకరించి శుద్ధి చేసి సప్లై చేస్తున్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఎండిపోయిన చేతిపంపులను బాగు చేయడం, ప్రైవేటు వ్యక్తులకు చెందిన వ్యవసాయ బావులు, బోర్లను అద్దెకు తీసుకుని తాగునీటి అవసరాలకు వాడుతున్నారు. మిషన్ భగీరథ నీరు అందని లోతట్టు ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు, గిరిజన తండాలకు మున్సిపాలిటీలు, పంచాయతీల ద్వారా ఉచితంగా వాటర్ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. మరోవైపు ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమం ద్వారా భూగర్భ జలమట్టాలను రీచార్జ్ చేయడానికి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు, పొలాల్లో పంట కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తోంది.
తాగునీటికి ఉపయోగించే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు (టీఎంసీలలో)
ప్రాజెక్టు పేరు పూర్తి సామర్థ్యం ప్రస్తుత నీటి నిల్వ తాగునీటి కోసం
నాగార్జునసాగర్ 312.05 137.86 6.53
శ్రీశైలం 215.81 41.89 6
శ్రీరాంసాగర్
(ఎస్సారెస్పీ) 80.50 18.24 3
ఎల్లంపల్లి 20.18 7.85 4
మిడ్ మానేరు 27.55 7.45 4
లోయర్ మానేరు
(ఎల్ఎండీ) 24.03 5.62 3
సింగూరు ప్రాజెక్టు 29.92 4.53 3
